GM Layoffs: ఈ ఏడాదైనా మంచి రోజులు వస్తాయని భావించిన వేతన జీవులకు ఇంకా కష్టాలు తీరడం లేదు. గతంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీలు కాస్తా ఇప్పుడు కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడుల పేరిట లేఆఫ్స్ ఇస్తున్నాయి. కేవలం ఒక్కసారితో వదిలిపెట్టకుండా రెండో రౌండ్, మూడో రౌండ్ అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఎప్పుడు తమ వంతు వస్తుందోనని ఉద్యోగులు భయాందోళనతో ఉన్నారు. తాజాగా మరో ప్రముఖ కంపెనీ నుంచి లేఆఫ్స్ స్వరం వినిపించింది.
సాఫ్ట్‌వేర్ మరియు సేవలు విభాగంలో పనిచేస్తున్న వందలాది మందిని జనరల్ మోటార్స్ ఉద్యోగాల నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు తెలిపింది. ఇందులో డెట్రాయిట్ సమీపంలోని GM టెక్ క్యాంపస్ నుంచి దాదాపు 600 మంది కొలువు కోల్పోయినట్లు తెలుస్తోంది. కంపెనీలో 76 వేల మంది వేతన జీవులు పనిచేస్తుండగా.. తాజా లేఆఫ్స్ మొత్తంగా 1.3 శాతం సిబ్బందిపై ప్రభావం చూపనున్నట్లు సమాచారం.

'కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. సంస్థ అభివృద్ధి కోసం పలు పెట్టుబడి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాల్సి వస్తోంది. GM ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మార్కెట్లో దృఢంగా నిలబడేందుకు మా ఉద్యోగులు అందించిన సహకారాన్ని మరువలేము' అని జనరల్ మోటార్స్ ప్రతినిధులు ఓ ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
కంపెనీలో ఏర్పడిన నాయకత్వ మార్పు తర్వాత GM ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మైక్ అబాట్ ఆరోగ్య కారణాల రీత్యా సంస్థ నుంచి నిష్క్రమించిన 6 నెలల వ్యవధిలో ఈ నిర్ణయాలు అమలవుతున్నాయి. కంపెనీ తయారు చేసిన వాహనాల్లో ఇటీవల సాఫ్ట్‌వేర్ లోపాలు తలెత్తడం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోంది. వీటివల్ల ఒకానొక సమయంలో స్టాప్ సేల్ నోటీస్ కూడా ఇవ్వాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications