వచ్చే ఐదేళ్లలో ప్రపంచం తీవ్రమైన వేడితో అల్లాడిపోనుంది... వాతావరణ సంక్షోభంపై యూఎన్ తాజా హెచ్చరిక..
భూతాపం (Global Warming) కారణంగా మన గ్రహం ఎదుర్కొంటున్న ముప్పుపై అంతర్జాతీయ సమాజానికి మరో గట్టి హెచ్చరిక అందింది. ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ, బ్రిటన్ వాతావరణ విభాగమైన 'మెట్ ఆఫీస్' సంయుక్తంగా విడుదల చేసిన ఒక సరికొత్త పరిశోధనా నివేదిక రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వాతావరణం దారుణంగా మారబోతోందని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం, రాబోయే ఐదేళ్ల కాలంలో భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి.
పారిశ్రామిక విప్లవానికి ముందు, అంటే 1850 నుండి 1900 మధ్య కాలం నాటి సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే, రాబోయే ఐదేళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.3 నుండి 1.9 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలపై బ్రిటన్ మెట్ ఆఫీస్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మెలిస్సా సీబ్రూక్ స్పందిస్తూ.. భూమి నిరంతరం వేడెక్కుతోందని, ప్రపంచ ఉష్ణోగ్రతలు అదుపులేకుండా పెరుగుతున్నాయనడానికి ఇప్పుడు స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు లభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నివేదికలోని అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. పారిస్ వాతావరణ ఒప్పందం నిర్దేశించుకున్న లక్ష్మణ రేఖ ప్రమాదంలో పడటం. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా పరిమితం చేస్తామని 2015లో ప్రతిజ్ఞ చేశాయి. ఎందుకంటే ఈ పరిమితి దాటితే వరదలు, కరువులు, వినాశకరమైన వడగాలులు మరియు తీవ్రమైన తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఊహించని రీతిలో విరుచుకుపడతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.
కాగా, కొత్త నివేదిక అంచనాల ప్రకారం 2026 నుండి 2030 మధ్య కాలంలో కనీసం ఒక సంవత్సరమైనా ప్రపంచ ఉష్ణోగ్రతలు ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ ప్రమాదకర పరిమితిని దాటేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో ఏదో ఒక సంవత్సరం, 2024 కంటే భయంకరమైన వేడిని చూడబోతోందని నివేదిక పేర్కొంది. అయితే, కేవలం ఒక సంవత్సరంలో ఈ పరిమితి దాటినంత మాత్రాన పారిస్ ఒప్పందం పూర్తిగా విఫలమైనట్లు కాదని, ఎందుకంటే ఈ లక్ష్యాలు 20 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. కానీ, భూమి వేడెక్కే వేగం ఇలాగే ఉంటే ఈ పరిమితిని పదేపదే దాటాల్సి వస్తుందని, 1.5 డిగ్రీల లక్ష్యాన్ని కాపాడటానికి మనకున్న సమయం చాలా వేగంగా ముగిసిపోతోందని మెలిస్సా సీబ్రూక్ హెచ్చరించారు.
ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క అత్యంత తీవ్రమైన మరియు వినాశకరమైన ప్రభావం ఆర్కిటిక్ ప్రాంతంపై పడనుంది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రతలు మూడున్నర రెట్లు వేగంగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్ల శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 2.8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదు కావచ్చు. దీనివల్ల ఆర్కిటిక్ సముద్రంలోని మంచు పలకలు వేగంగా కరిగిపోతాయని, ముఖ్యంగా మార్చి నెలలో బారెంట్స్, బేరింగ్ మరియు ఓఖోట్స్క్ సముద్రాలలో మంచు కరగడం తీవ్రమౌతుందని అంచనా వేశారు. ఆర్కిటిక్‌లో సంభవించే ఈ మార్పులు మొత్తం ప్రపంచ వాతావరణ వ్యవస్థను తలకిందులు చేసి, అనేక దేశాలలో వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తాయి.
దీని ప్రభావంతో రాబోయే ఐదేళ్లలో ఉత్తరార్ధగోళంలోని అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో అసాధారణమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మే నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో ఉత్తర యూరప్, అలాస్కా, సైబీరియా మరియు సాహెల్ ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, అందుకు పూర్తి విరుద్ధంగా అమెజాన్ అడవుల ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాలకు తోడు, ఈ శీతాకాలంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే బలమైన 'ఎల్ నినో' ప్రభావం 2027 వరకు కొనసాగవచ్చని నివేదిక అంచనా వేసింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను పెంచే ఈ ఎల్ నినో వాతావరణాన్ని మరింత వేడెక్కించి, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వేడిని సృష్టించనుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
