Tech Layoffs: గత ఏడాది మెుదలైన కోతలు టెక్ పరిశ్రమను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఏడాది కుదుటపడుతుందని అంచనా వేసినప్పటికీ టెక్కీలకు ఊరట లభించటం లేదు. ఇంకా పరిస్థితులు దిగజారుతున్నట్లు తాజా డేటా చెబుతోంది.
కొత్త ఏడాది 2024లో టెక్ కంపెనీలు ఒకపక్క నియామకాలను నిలిపివేసి.. మరోపక్క ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నాయి. ఏఐ టూల్స్ వినియోగంతో పాటు టెక్ కంపెనీలకు డీల్ మందగమనంతో పెరిగిన మార్జిన్ ప్రెజర్, తగ్గిన ఆదాయాలు, లాభాలు ఆందోళనలను పెంచేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యలను తగ్గించటం ప్రారంభించాయని వెల్లడైంది. నివేదిక ప్రకారం ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలల కాలంలో టాప్ టెక్ కంపెనీలు ఏకంగా 70,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడైంది.

లేఆఫ్స్ ట్రెండ్ కరోనా తర్వాత రెండేళ్ల కిందట మెుదలైంది. మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నుంచి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యలను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటున్నాయి. 2023 రెండవ అర్థ సంవత్సరం నుంచి తొలగింపులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2024లో ఆపిల్ తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో 614 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ తన కోర్ టీమ్ నుంచి 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడైంది. దీనికి తోడు గతవారం పైథాన్, ఫ్లట్టర్, డార్ట్ టీమ్‌లకు చెందిన ఉద్యోగులను సైతం లేఆఫ్ చేసింది.
ఇక అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో 62 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో ఇండియన్ ఎడ్‌టెక్ స్టార్టప్ దిగ్గజం దాదాపు 500 మంది ఉద్యోగులకు స్వస్తి పలికింది. అలాగే వ్యాపార మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న టెస్లా కొత్త ప్రాజెక్టులకు బ్రేక్ వేసి ఉద్యోగుల తగ్గింపును ప్రారంభించింది. చైనాలో అమ్మకాలు పెంచేందుకు మస్క్ అక్కడి అధికారులతో ఆకస్మిక పర్యటనలో చర్చలు జరిపారు. ఇక క్యాబ్ సర్వీస్ వ్యాపారంలో ఉన్న ఓలా 10 శాతం ఉద్యోగులను, వర్ల్‌పూల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల నుండి దాదాపు 1,000 మందిని తొలగించాయి.


Click it and Unblock the Notifications