యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని తన డేటా సెంటర్లలో ఒకదానిలో అమెజాన్ క్లౌడ్ విభాగం - AWS (అమెజాన్ వెబ్ సర్వీసెస్) కు సంబంధించిన విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. గుర్తు తెలియని వస్తువులు దాన్ని ఢీకొట్టడంతో అక్కడ మంటలు చెలరేగినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఘటన ఉదయం 4:30 గంటల సమయంలో (PST ప్రాంతం ప్రకారం) జరిగినట్లు AWS అధికారికంగా వెల్లడించింది.
అగ్నిప్రమాదం చోటుచేసుకున్న వెంటనే భద్రతా చర్యలలో భాగంగా డేటా సెంటర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే పూర్తి స్థాయి కనెక్టివిటీని తిరిగి పునరుద్ధరించడానికి కొన్ని గంటలు పట్టవచ్చని AWS స్పష్టం చేసింది. యూఏఈలోని ఇతర AWS డేటా సెంటర్లు మాత్రం సాధారణంగానే పనిచేస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ఘటనకు ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు సంబంధం ఉందా అనే అంశాన్ని AWS ఇప్పటివరకు ధృవీకరించలేదు. అయినప్పటికీ, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ సంఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం, ఇరాన్ ప్రతీకార చర్యలలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు సమాచారం. క్షిపణులు, డ్రోన్లు విమానాశ్రయాలు, ఓడరేవులు, నివాస ప్రాంతాలపై దాడి చేయడంతో మరణాలు మరియు గాయాలు సంభవించాయి. దుబాయ్‌లోని ఒక ప్రముఖ ఐదు నక్షత్రాల రిసార్ట్‌లో అగ్నిప్రమాదం సంభవించగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం సహా నగర స్కైలైన్‌కు ముప్పు ఏర్పడింది. అబుదాబి విమానాశ్రయంలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
ఈ దాడులకు ప్రతిస్పందనగా.. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లోని ఆరు దేశాలు.. యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్ - అత్యవసర వీడియో సమావేశాన్ని నిర్వహించాయి. భద్రతను కాపాడటం, పౌరులను రక్షించడం, తమ భూభాగాలను కాపాడుకోవడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అవసరమైతే దూకుడుకు ప్రతిస్పందించే మార్గాలపై కూడా చర్చ జరుగుతుందని.. ఇరాన్ దాడులను వెంటనే నిలిపివేయాలని GCC పిలుపునిచ్చింది. గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వం ప్రపంచ ఆర్థిక భద్రతకు ఎంతో కీలకమని కూడా ఈ సమావేశంలో హైలైట్ చేశారు.
యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ తెలివిగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ దాడులు తీవ్రమైన వ్యూహాత్మక తప్పిదమని, కీలక సమయంలో ఇరాన్ తనను తానే ఒంటరిగా చేసుకుంటోందని దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ వ్యాఖ్యానించారు.మీ యుద్ధం మీ పొరుగువారితో కాదని గార్గాష్ స్పష్టం చేస్తూ.. పరిస్థితి మరింత తీవ్రమయ్యే ముందు ఇరాన్ హేతుబద్ధంగా వ్యవహరించాలని, సమీప దేశాలతో బాధ్యతాయుత సంబంధాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications