Rice Prices: ప్రపంచ వ్యాప్తంగా ఉడికిపోతున్న బియ్యం ధరలు.. ఈ స్టాక్స్‌పై కన్నేయండి..
Rice Prices: ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు కుతకుత ఉడుకుతున్నాయి. దీని వల్ల ఇటు ఆసియాతో పాటు అటు ఆఫ్రికాలోని అనేక దేశాలు త్వరలో బియ్యం కొరతను ఎదుర్కొంటాయని వెల్లడైంది.ఇప్పటికే బియ్యం ధరలు 11 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. భారత ప్రభత్వం వరి మద్దతు ధరలను పెంచటంతో ధరలు మరింతగా ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయి.
దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతంపై ఎల్‌నినో ప్రభావం పరిస్థితిని మరింత క్లిష్టతరంగా మార్చింది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో దాదాపు 40 శాతానికి పైగా వాటాను భారత్ కలిగి ఉంది. ప్రపంచంలో బియ్యం చౌకగా సరఫరా చేసేది భారత్ అని ఎగుమతిదారుల సంఘం(REA) అధ్యక్షుడు బివి కృష్ణారావు అన్నారు.

దేశంలో MSP కారణంగా ధరలు పెరగటం ప్రారంభమయ్యాయి.. దీంతో ఇతర సరఫరాదారులు సైతం బియ్యం రేట్లను అంతర్జాతీయ మార్కెట్లలో పెంచారని కృష్ణారావు తెలిపారు. MSP పెంపు తర్వాత థాయ్‌లాండ్, వియత్నాంలో బియ్యం ఎగుమతి ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయికి పెంచాయి. ఇదే క్రమంలో భారత బియ్యం ఎగుమతుల ధర ఐదేళ్ల గరిష్ఠ స్థాయి 9 శాతానికి పెరిగింది. ఈ క్రమంలో మన దేశం ఎగుమతులను తగ్గించినా లేక నిలిపివేసినా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎల్‌నినో కారణంగా దేశీయ సరఫరాకు అంతరాయం ఏర్పడితే 1 మిలియన్ టన్నుల దిగుమతి చేసుకునేందుకు ఇండోనేషియా ఇటీవల భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆహారంగా తీసుకుంటున్న 3 బిలియన్ల మంది ఎల్‌నినో కారణంగా ప్రభావితం కావచ్చని తెలుస్తోంది.
గ్లోబల్ ట్రేడింగ్ హౌస్‌లు అన్ని కీలక వరి ఉత్పత్తి దేశాల దిగుబడిపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్‌లాండ్ సాధారణం కంటే తక్కువ వర్షపాతం చూస్తుండగా.. ఇండియాలో ఆలస్యంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 2023/24 చివరి నాటికి గ్లోబల్ రైస్ ఇన్వెంటరీలు ఆరేళ్ల కనిష్టానికి తగ్గుతాయని అంచనా వేయబడింది.
ఈ క్రమంలో ప్రధానంగా బియ్యం ఎగుమతి చేసే కంపెనీల స్టాక్స్ ప్రభావితం అవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. KRBL, Kohinoor Foods, LT Foods, Lakshmi energy and foods, Chaman Lal Setia Exports Ltd, GRM Overseas Ltd కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్‌లో ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications