కుప్పకూలుతున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు.. 24 గంటలు పవర్ కట్.. తీవ్రమైన చమురు, గ్యాస్ సంక్షోభం..
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దాదాపు 40 శాతం మేర పడిపోయి, గ్లోబల్ ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఈ అంతర్జాతీయ సంక్షోభానికి అమెరికా ఆంక్షలు తోడవ్వడంతో క్యూబా దేశం ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా అంధకారంలో మునిగిపోయింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబాకు ఇంధనాన్ని సరఫరా చేసే వెనిజులా, మెక్సికో వంటి దేశాలపై భారీ సుంకాలు, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో ఆ దేశాలు సరఫరాను నిలిపివేశాయి. ఫలితంగా క్యూబాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, రాజధాని హవానాతో పాటు దేశవ్యాప్తంగా రోజుకు 20 నుండి 22 గంటల పాటు సుదీర్ఘ విద్యుత్ కోతలు (బ్లాక్ అవుట్) అమలవుతున్నాయి.
ఈ దారుణ పరిస్థితి వల్ల ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడటమే కాకుండా ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. డిసెంబర్ నుండి ఇప్పటివరకు రష్యాకు చెందిన 'అనటోలి కోలోడ్కిన్' అనే ఒకే ఒక్క ఆయిల్ ట్యాంకర్ క్యూబాకు ఇంధనాన్ని అందించగలిగింది.

ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి క్యూబా తన దేశీయ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్‌తో పాటు గత రెండేళ్లలో ఏర్పాటు చేసిన 1,300 మెగావాట్ల సౌర శక్తిపై ఆధారపడుతున్నప్పటికీ గ్రిడ్ అస్థిరత వల్ల అది సరిపోవడం లేదు. తాము ఏ దేశం నుండైనా ఇంధనం కొనడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ ఇంధన మంత్రి ప్రకటించారు.
ఈ ఇంధన సంక్షోభ ప్రభావం కేవలం క్యూబాకే పరిమితం కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలనూ వణికిస్తోంది. పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా రేషనింగ్ నిబంధనలు కూడా విధించాయి. పాకిస్తాన్‌లో దేశ చరిత్రలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 414.78, డీజిల్ ధర రూ. 414.58 కి చేరింది. ప్రతి వారం ధరలను సవరించాల్సి వస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు, రైతులు, రవాణా రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన జెట్ ఇంధన కొరత ఏర్పడింది. ఇంధన ధరలు బారెల్‌కు $150-200 కి పెరగడంతో వందలాది విమాన సర్వీసులు రద్దయి విమానయాన రంగం సంక్షోభంలో పడింది.
ఇదే క్రమంలో బంగ్లాదేశ్‌లో తీవ్రమైన ఇంధన కొరత కారణంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అక్కడ ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈజిప్ట్ దేశం కూడా విద్యుత్, ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఒకరోజు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (రిమోట్ వర్క్) విధించింది.
వాణిజ్య కేంద్రాలు, వీధి దీపాల వినియోగంపై కూడా అక్కడ పరిమితులు పెట్టారు. ఇటలీలో కూడా దేశవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి అక్కడి ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ పన్నులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు త్వరగా ముగియకపోతే మున్ముందు ఈ ఇంధన ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
