Coca-Cola: ఇండియాలో చేతులెత్తేసిన కోకాకోలా.. ఆ వ్యాపారంలో 40% వాటా విక్రయం, పూర్తి వివరాలు
Coca-Cola News: భారతదేశంలో శీతలపానీయాల వ్యాపారంలో కోకాకోలా అతిపెద్ద ఆటగాళ్లలో ఒకరు. అమెరికాకు చెందిన పెప్సికోతో కంపెనీ ఇండియాలో పోటీని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ క్యాంపా కోలా గట్టి పోటీని ఇవ్వటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోకాకోలా వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకొచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా శీతలపానీయాల వ్యాపారంలో రారాజుగా ఉన్న కోకాకోలా ప్రస్తుతం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఉన్న బాటిలింగ్ వ్యాపారం హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ లిమిటెడ్ లో 40 శాతం వాటాలను జుబిలెంట్ భారతీయ గ్రూపుకు బదలాయించాలని నిర్ణయించింది. దేశంలో కోకాకోలా కార్యకలాపాలలో వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. దేశంలోని శీతల పానీయాల రంగంలో జూబిలెంట్ భారతీయ గ్రూప్ ప్రభావం పెరుగుతున్న వేళ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య అగ్రిమెంట్ జరిగినట్లు మల్టీబిలియన్ డాలర్ సంస్థ నేడు ప్రకటించింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ.12,500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. తాజా కొనుగోలు ఒప్పందంతో భారతియా కుటుంబాన్ని దేశీయ పానీయాల పరిశ్రమలో ప్రధాన ఆటగాడిగా నిలుపుతుందని తెలుస్తోంది. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ శీతల పానీయాలు, జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌తో సహా ఎనిమిది విభాగాల్లో 37 ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా కొనసాగుతోంది. కోకాకోలాకు అమ్మకాల పరంగా ఇండియా 5వ అతిపెద్ద మార్కెట్ గా కొనసాగుతోంది. ఇక్కడ తలసరి వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ భారీ జనాభాను కలిగి ఉండటంతో గణనీయమైన విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ డీల్ కోసం భారతీయా గ్రూప్ గోల్డ్‌మన్ సాక్స్‌తో ఫైనాన్సింగ్ భాగస్వామ్యాన్ని ఎంచుకోవటం గమనార్హం.
వాస్తవానికి ప్రస్తుతం కోకాకోలా ఇండియా కూడా పెప్సికో ఇండియాలో ఫాలో అవుతున్న అసెట్ లైట్ మోడల్‍ని పాటిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి ముందు పెప్సికో కంపెనీ తన బాటిలింగ్ సామర్థ్యాలను వరుణ్ బెవరేజెస్ కంపెనీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోకాకోలా తీసుకున్న నిర్ణయం కంపెనీ ఐపీవో ప్రణాళికలకు మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ఆదాయం రూ.14,021 కోట్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. అలాగే కంపెనీ రానున్న 5 ఏళ్ల కాలంలో గుజరాత్, మధ్యప్రదేశలలో తమ బాటిలింగ్ సామర్థ్యాలను విస్తరించటానికి 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications