Layoff News: రోజులు గడచే కొద్ది అన్ని సర్థుకుంటాయని అటు కంపెనీలు, ఇటు ఉద్యోగులు ఆశాభావంగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం మరింతగా దిగజారుతూనే ఉన్నాయి. వ్యాపర అస్థిరతలతో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల కోతలను అనుకరిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటిగా ఉన్న సిటీ గ్రూప్ తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఏడాది మూడవ త్రైమాసికంలో కంపెనీ తమ ఖర్చులను తగ్గించే క్రమంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో 2023లో కంపెనీ మెుత్తంగా 7000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న కాలంలో ఇవి కొనసాగుతాయా అనే ఆందోళనలు మిగిలిన ఉద్యోగులను కలవరపెడుతున్నాయి.

కంపెనీ ఉద్యోగుల తొలగింపు కారణంగా వారికి దాదాపు 650 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం వెల్లడైంది. వారు నోటీసు పిరియడ్ ముగించుకుని కంపెనీని వీడే సమయానికి సంబంధిత మెుత్తాలను అందజేస్తుందని వెల్లడైంది. సిటీ గ్రూప్ CFO మార్క్ మాసన్ ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్‌లో తొలగించిన ఉద్యోగులకు 450 మిలియన్ డాలర్లు కంపెనీ చెల్లించినట్లు వెల్లడైంది.

ప్రస్తుత వ్యాపార వాతావరణానికి అనుగుణంగా కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగానే సిటీ గ్రూప్ ఉద్యోగాల కోతలకు వెళ్లిందని సమాచారం. రానున్న కాలంలో మరింత మందిని తొలగించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన సంఖ్యలను మాత్రం కంపెనీ బయటపెట్టలేదు. తాజా రిట్రెంచ్‌మెంట్ తర్వాత బ్యాంకింగ్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మెుత్తం ఉద్యోగుల సంఖ్య 2,40,000గా ఉంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం మూడో త్రైమాసికంలో ఖర్చులు 6 శాతం పెరిగి 13.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications