Pension: నెలకు రూ.55 చెల్లిస్తే చాలు.. ఏడాదికి రూ.36వేలు పింఛను పొందొచ్చు.. ఎలాగో తెలుసా?
Pension Scheme:ఈ రోజుల్లో చాలా మంది భయం వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా జీవించటం ఎలా అన్నదాని గురించే. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా గడపటం గురించి ప్లానింగ్ చాలా ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే మనలో ఎంతమంది సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏ ప్రాజెక్ట్‌లో చేయాలి అనేది గమనించవలసిన అసలు విషయం.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
భవిష్యత్తులో అక్కరకు వచ్చే విధంగా, లాభదాయకమైన మంచి స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా సామాన్యులకు సెట్ అయ్యే పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మండన్ యోజన (PM-SYM) స్కీమ్ గురించే. ఇందులో కేవలం నెలకు రూ.55 పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ఏడాదికి రూ.36,000 పెన్షన్ పొందవచ్చు.

ఎలాంటి వారికి ఎక్కువ ఉపయోగం..
ఈ స్కీమ్ ప్రధానంగా అల్పాదాయ వర్గాల వారికి, తక్కువ వేతనాలు పొందే వారికి, మహిళలు, స్వయం ఉపాధి పొందే వారికి ఎక్కువ ప్రయోజనకరమని చెప్పుకోవచ్చు. దీనికి తోడు డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు, హాకర్లు, చెప్పుల పనివారు మొదలైన వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

నెలకు రూ.3,000 పింఛను..
ఈ స్కీమ్ ద్వారా 60 ఏళ్లు నిండిన తరువాత ప్రతి నెలా రూ.3,000 పింఛను అందజేస్తారు. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అర్హులైన భార్యాభర్తలిద్దరూ రూ.72,000 పెన్షన్‌గా పొందవచ్చు.

పథకాన్ని ఎలా పొందాలి..?
ఎవరైనా ఈ పథకాన్ని యాక్సెస్ చేయడానికి ఏదైనా పబ్లిక్ సర్వీస్ సెంటర్‌ని సందర్శించడం ద్వారా మీ PM-SYM ఖాతాను తెరవవచ్చు. దీని కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి డాక్యుమెంట్స్ అవసరం. ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మండన్ యోజనలో ఖాతా తెరిచిన తర్వాత దరఖాస్తుదారుకు శరమ్ యోగి కార్డ్ అందించబడుతుంది.

ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..?
ఈ స్కీమ్ కింద రూ.55 నుంచి రూ.200 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉన్న దరఖాస్తుదారు ఈ పథకంలో నెలకు రూ.55 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 30 ఏళ్ల దరఖాస్తుదారు నెలకు రూ.100 పెట్టుబడి పెట్టాలి. మీకు 40 ఏళ్లు ఉంటే.. నెలకు 200 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 18 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టే వ్యక్తి 42 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications