బేజారిన జర్మన్ దిగ్గజ బ్యాంక్ Deutsche Bank AG.. కుప్పకూలిన స్టాక్.. ఏం జరుగుతోంది..?
Deutsche Bank: బ్యాంకింగ్ రంగంలో భయాలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన బ్యాంకులు సైతం నేలకొరగటం ఇన్వెస్టర్లతో పాటు సామాన్యుల్లోనూ ఆందోళనలను కలిగిస్తోంది. అమెరికా బ్యాంకులు దివాలా తీయటంతో ప్రారంభమైన ఈ ఆందోళనలు స్విడ్జర్లాండ్, జర్మనీలకూ పాకాయి. చాలా మంది నిపుణులు అంచనా వేసినట్లుగానే ఒకటి తర్వాత మరో బ్యాంక్ మార్కెట్లలో కుప్పకూలుతూ ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.
యూరోపియన్ బ్యాంకుల స్థిరత్వంపై ఆందోళనలు కొనసాగుతున్నందున.. గురువారం రాత్రి క్రెడిట్ డిఫాల్ట్ మార్పిడులు పెరగడంతో షేర్లు శుక్రవారం 14% కంటే ఎక్కువ పడిపోయాయి. ఈ క్రమంలో ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ మార్కెట్లో డ్యుయిష్ బ్యాంక్ షేర్లు వరుసగా మూడో రోజు తిరోగమనాన్ని చవిచూశాయి. ఈ నెలలో ఇప్పటివరకు స్టాక్ విలువ ఐదవ వంతు కంటే ఎక్కువ నష్టపోయిందని తెలుస్తోంది.

ఈ ఆందోళనల కారణంగా జర్మన్‌కు చెందిన డ్యుయిష్ బ్యాంక్‌తో పాటు క్రెడిట్ సూయిస్, యూబీఎస్, సొసైటీ జనరల్, బీఎన్పీ పారిబార్ వంటి బ్యాంకుల షేర్లు సైతం క్షీణతను నమోదు చేశాయి. ఖర్చులను తగ్గించి లాభదాయకతను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ప్రారంభమైన మల్టీబిలియన్ యూరోల పునర్నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత డ్యుయిష్ బ్యాంక్ వరుసగా 10 త్రైమాసికాల్లో లాభాలను నివేదించింది.
అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లటం బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాలకు కారణమని రేటింగ్ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో లోపల, బయట ఉన్న దీర్భకాలిక ఆందోళనలను తీవ్రమైనవి కాకుండా రెగ్యులేటరీలు చర్యలు తీసుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిళ్లు అధికమయ్యాయి. మాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు అనేక నెలలుగా తమ వడ్డీ రేట్లను వరుసగా పెంచుతూ పోతున్నందున ఆ ప్రభావం బ్యాంకింగ్ నిర్వహణ, మూలధన లభ్యత వంటివాటిపై పడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications