Covid 19 impact: భారత్‌పై పెను ప్రభావం, 8 ఏళ్లలో అత్యంత చెత్త రికార్డ్!
భారత ఆర్థిక వ్యవస్థ రికార్డ్ త్రైమాసిక ప్రతికూలతను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్‌తో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇప్పటికే డిమాండ్, వినియోగం, పెట్టుబడులు క్షీణించాయి. దీనికి తోడు రికార్డ్ క్వార్టర్ ప్రతికూలత నమోదు కావొచ్చునని సర్వే వెల్లడిస్తోంది. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీడీపీ జూన్ క్వార్టర్‌లో 18.3 శాతం మేర క్షీణిస్తుందని రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

8 ఏళ్లలో వరస్ట్ క్వార్టర్
అంతకుముందు క్వార్టర్‌లో 3.1 శాతం వృద్ధి రేటు నమోదయింది. ఈసారి 18.3 శాతం ప్రతికూలత ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. గత ఎనిమిదేళ్లలో అత్యంత వరస్ట్ రికార్డ్ ఇదే అవుతుంది. అదే సమయంలో రానున్న సెప్టెంబర్ క్వార్టర్‌లో 8.1 శాతం ప్రతికూలత, డిసెంబర్ త్రైమాసికంలో 1 శాతం ప్రతికూలతను అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలను చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రికవరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆసియా దేశాల్లో భారత్‌లోనే అత్యధికం
కరోనా లాక్ డౌన్ వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టం ఆసియాలోని ఇతర దేశాల కంటే భారత్‌పై ఎక్కువ ప్రభావం చూపిందని సింగపూర్‌లోని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో భారత ఆర్థికవేత్త షిలాన్ షా అన్నారు. కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పటికీ కొన్ని నగరాల్లో కరోనా కేసులను బట్టి ఆంక్షలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. రెస్టారెంట్స్ సహా దాదాపు అన్నీ మూతబడ్డాయి. తయారీ, సేవలు, రిటైల్ అమ్మకాలు దెబ్బతిన్నాయి. కార్మికులకు పని లేకుండా పోయింది.

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి
జూన్ క్వార్టర్‌లో 15 శాతం ప్రతికూలతను అంచనా వేశారు షిలాన్ షా. లాక్ డౌన్ అనంతరం రికవరీ నిలిచిపోయిందని, కోలుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌తో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 10 శాతం ప్రతికూలత ఉండవచ్చునని, అదే జరిగితే 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇది దారుణమైన సంకోచమని ఆర్థికవేత్తలు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం కేంద్ర ప్రభుత్వం 21 లక్లల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. పేదలకు ఉచిత రేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది. మహిళల అకౌంట్లలో నెలకు రూ.500 వేసింది. మరోవైపు ఆర్బీఐ 115 పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది.


Click it and Unblock the Notifications