GCC Hiring: భారతదేశంలో ప్రస్తుతం ఐటీ కంపెనీల కంటే వేగంగా జీసీసీల ఏర్పాటు జరుగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల నుంచి ప్రావీణ్యం కలిగిన హై పెయిడ్ ఉద్యోగులకు నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇది కాస్త ప్రస్తుతం సాంప్రదాయ ఐటీ కంపెనీల కంటే ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు తమ జీసీసీ కేంద్రాలను ఇండియాలో ప్రారంభించేందుకు ఆసక్తి చూపటంతో వీటిని ఆకట్టుకునేందుకు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక పాలసీని ప్రారంభించాయి. ముందుగా మహారాష్ట్ర తన 2025 పాలసీ మూలధన వ్యయం, పేరోల్, నైపుణ్యాల పెంపుదల, పరిశోధన మరియు అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. దీని తర్వాత కర్ణాటక దాదాపు 500 కొత్త జీసీసీలను 2029 నాటికి ఆకట్టుకునే ఆలోచనతో కొత్త పాలసీని ఇటీవల ప్రవేశపెట్టింది. ఏఐ, ఆర్ అండ్ డి, టాలెంట్ డెవల్మెంట్, పెట్టుబడుల పెంపుపై ఈ పాలసీ దృష్టి సారించింది. ఇక చివరిగా ఏపీ కూడా తన జీసీసీ పాలసీని ప్రకటిస్తూ ఐటీ, కోవర్కింగ్ వంటి వాటిని ప్రోత్సహిస్తోంది.

ప్రస్తుతం జీసీసీలు ఐటీ సేవలను అందించడం కంటే ఆవిష్కరణ, వ్యూహాత్మక సామర్థ్యాలపై దృష్టి సారించడానికి ముందడుగు వేస్తున్నాయి. ఇందులో భాగంగా సదరు కంపెనీలు సాంకేతిక నిపుణులతో పాటు డొమైన్ నాలెడ్జ్ ఉన్న అనుభవజ్ఞుల కోసం వేతుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రానున్న కొన్ని సంవత్సరాల్లో వారి నియామకాలు దాదాపు 20% పెరుగుతాయని అంచనా వేయబడింది. ప్రధానంగా ఏఐ ద్వారా మోసాల గుర్తింపు, నియంత్రణ సాంకేతికత, పరిమాణాత్మక విశ్లేషకులు, బ్లాక్‌చెయిన్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీలో పాత్రల కోసం నియామకాలు చేసుకుంటున్నాయని టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది.
తెలంగాణ కొత్త వ్యూహం..
ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు కొత్తగా గ్లోబల్ వాల్యూ సెంటర్ల ఏర్పాటును ప్రకటించారు. వాస్తవానికి ఇది జీసీసీ వ్యవస్థకు భవిష్యత్తు లాంటిది. హైదరాబాద్‌ను బ్యాక్-ఆఫీస్ పవర్‌హౌస్ నుంచి ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణల్లో అగ్రగామిగా మార్చేందుకు ఈ చర్య దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు. వాస్తవానికి ఇది ప్రస్తుతం కొనసాగుతున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు అప్‌గ్రేడ్ అని మంత్రి పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా ప్రపంచ సంస్థలకు టెక్నాలజీ, బిజినెస్ ఆపరేషన్స్‌కి సేవలను జీసీసీల ఏర్పాటుతో హైదరాబాద్ సేవలను అందిస్తోంది.
కరీంనగర్-వరంగల్..
తెలంగాణ జీసీసీల ఆకర్షణకు కేంద్ర బిందువుగా మారింది. 2023 నుంచి జీసీసీలను ఆకట్టుకునే విషయంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిభ కలిగిన ఉద్యోగుల లభ్యత, మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల ప్రయోజనాల కారణంగా GCCలకు తెలంగాణ స్వర్గధామంగా మారిపోయింది. ఈ క్రమంలో ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలు ఇందులో కీలక భాగస్వాములుగా మారుతున్నాయి. LTI మైండ్‌ట్రీ, జెన్‌ప్యాక్ట్, సైయంట్ వంటి కంపెనీలు ఇప్పటికే వరంగల్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications