Adani News: రాకెట్ స్పీడ్‌తో గౌతమ్ అదానీ.. మిసైల్‌లా దూసుకొచ్చిన నందన్ నీలేకని.. అంచనాలన్నీ కల్లాస్..
Top 100 influeners: గతేడాది జనవరి చివరి నుంచి గౌతమ్ అదానీ సామ్రాజ్యానికి బీటలు వారాయి. అమెరికన్ పరిశోధనా సంస్థ హిండెన్‌బెర్గ్ ఆరోపణలతో దాదాపు అన్ని వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. ఇక అందరూ అదానీ గ్రూప్ పని అయిపోయింది అనుకున్నారు. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఏడాది తిరిగేసరికి పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి దక్కించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా ఓ కొత్త రికార్డును క్రియేట్ చేశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన '2024 సంవత్సరపు టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన భారతీయుల' జాబితాను ఈరోజు విడుదల చేసింది. దేశాన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయ, వ్యాపార, వినోద మరియు క్రీడా రంగాలలోని వ్యక్తులకు ఇందులో చోటు కల్పించింది. అయితే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. తోటి బిలియనీర్ ముఖేష్ అంబానీని వెనక్కునెట్టి మరీ ఈ లిస్టులో 10వ స్థానాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

గతేడాదితో పోలిస్తే అదానీ దాదాపు 33 స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి చొచ్చుకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన వెన్నంటే ఉన్నారు. వీరితో పాటు వ్యాపార రంగంలో అజీమ్ ప్రేమ్‌జీ 37వ ప్లేస్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఏకంగా 44 ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని 95వ స్థానంలోకి దూసుకొచ్చారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (BBI) ప్రకారం ముఖేష్ అంబానీ 109 బిలియన్ డాలర్ల నికర విలువతో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ 20 లక్షల కోట్లకు చేరుకున్న తర్వాత రిలయన్స్ దేశంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ఇక 101 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండవ స్థానం కైవసం చేసుకున్నారు.
2024లో టాప్ 100 ప్రభావవంతమైన భారతీయుల లిస్టును చూస్తే.. అధికార భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యులు మెజారిటీ స్థానాల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ మరియు హోం మంత్రి అమిత్ షా ఈ జాబితాలో వరుసగా ఏడవ సంవత్సరం కూడా మొదటి రెండు స్థానాలను పొందారు. భారత 4వ స్థానంలోని ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ మరియు 10వ ర్యాంకు పొందిన అదానీ మినహా మొదటి 10 ర్యాంకులను RSS/BJP నేతలు ఆక్రమించారు.
తదుపరి 10 ర్యాంకుల్లో మమతా బెనర్జీ 15వ స్థానం, రాహుల్ గాంధీ 16, అరవింద్ కేజ్రీవాల్ 18వ స్థానంలో ఉన్నారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్య మరియు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ వరుసగా 22 మరియు 25 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా 46, రెజ్లర్ వినేష్ ఫోగట్ 100వ స్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్ 27, ఆలియా భట్ మరియు దీపికా పదుకొనేలు 79 మరియు 80 ర్యాంకులు సాధించారు.


Click it and Unblock the Notifications