Adani: తొలిసారి వెనుకడుగు వేసిన అదానీ.. ఆ కంపెనీ కొనుగోలు నుంచి తప్పుకుంటూ..!!
Adani Power: గౌతమ్ అదానీ దూకుడుకు బ్రేకులు పడ్డాయా..? అదానీ కంపెనీల మార్కెట్ క్యాప్ పాతాళానికి చేరటంతో కొత్తగా అప్పులు పుట్టటం లేదా..? ప్రస్తుతం అదానీ గ్రూప్ తన వ్యాపార అవసరాలకు సరిపడా డబ్బు లేక ఉక్కిరిబిక్కిరి అవుతుందా..? ఇలాంటి అనేక ప్రశ్నలు మనలో చాలా మందికి సహజంగా వస్తాయి. మార్కెట్లో జరుగుతున్న అనేక పరిణామాలను గమనిస్తే ఇందులో ఒకింత వాస్తవం ఉందేమో అని అనుమానం కలగక మానదు.

ఏం జరుగుతోంది..
DB పవర్ కంపెనీకి చెందిన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కొనుగోలు చేసేందుకు గౌతమ్ అదానీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆగష్టు 18, 2022న ఇందుకోసం ఒప్పందం, అక్టోబర్ 31, 2022 నాటికి డీల్‌ను ముగించాలని ప్లాన్ చేసింది. అయితే గడువును అదానీ గ్రూప్ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. DB పవర్ ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపాలోని 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను రుణంతో సహా రూ.7,017 కోట్లకు కొనుగోలు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. అయితే బుధవారం ఈ ప్లాన్ ఒక్కసారిగా కుప్పకూలింది.

ప్లాన్ ఫెయిల్ వెనుక..
హిండెన్ బెర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో మూలధన వ్యయ ప్రణాళికలను సమీక్షించినందున అదానీ గ్రూప్ డిబి పవర్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను వదులుకుంది. భారత పోటీ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం పొందిన తర్వాత డీల్ పూర్తిచేసేందుకు గడువును నాలుగు సార్లు పొడిగించారు. చివరగా ఫిబ్రవరి 15, 2023న దీనికి గడువు ముగిసిందని అదానీ పవర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది

పెద్ద ఎదురుదెబ్బ..
2022లో డీల్ ప్రకటించినప్పుడు పవర్ రంగంలో ఇదొక అతిపెద్ద ఒప్పందంగా నిలిచింది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అదానీ గ్రూప్ డీల్ పూర్తి చేయలేకపోవటంతో అదానీ గ్రూప్ కు ఎదురుదెబ్బతగిలింది. ఈ ఒప్పందం పూర్తైతే దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ థర్మల్ పవర్ ప్రొడ్యూసర్‌గా అదానీ స్థానాన్ని మరింత పటిష్టం చేసేది. డీల్ పూర్తి చేయలేక పోవటంతో అదానీ ఇటీవలి కాలంలో తొలిసారిగా తన పెట్టుబడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరికొందరైతే అదానీ పతనం మెుదలైందని ఇది ఇంతటితో ఆగదని అనుకుంటున్నారు.

అదానీ పవర్ రుణాలు..
దేశంలోని విద్యుత్ తయారీ, పంపిణీ వ్యాపారాల్లో అదానీ గ్రూప్ కూడా అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. అదానీ పవర్ కంపెనీకి 5 రాష్ట్రాల్లో మెుత్తంగా 13.6GW సామర్థ్యం కలిగిన ఏడు థర్మల్ పవర్ ప్లాంటులు ఉన్నాయి. దీనికి తోడు 40MW సోలార్ పవర్ ప్రాజెక్టులను కలిగి ఉంది. సెప్టెంబరు 30, 2022 నాటికి అదానీ పవర్ కంపెనీకి దాదాపు రూ.36,031 కోట్ల రుణాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications