Gautam Adani: 10 అంతస్తుల ఆఫీసు అమ్మేస్తున్న అదానీ.. బిజీ ఏరియాలో సడన్ సెల్లింగ్..!
Adani Realty: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అదానీ గ్రూప్ కంపెనీ తనకున్న 10 అంతస్తుల ఆఫీసు కార్యాలయాన్ని విక్రయించాలని నిర్ణయించింది. మహానగరంలోని ఎక్కువగా రద్దీ ఉండే కమర్షియల్ ఏరియా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో ఉన్న అదానీ రియల్టీకి చెందిన వాణిజ్య సముదాయాన్ని విక్రయించడానికి సిద్ధమైంది.
విక్రయించబోతున్నది అదానీ గ్రూప్ రియల్ ఎస్టేట్ విభాగమైన అదానీ రియల్టీకి చెందిన కార్యాలయ భవనం అని తెలుస్తోంది. 10 అంతస్తుల ఆఫీస్ బిల్డింగ్ ఇన్‌స్పైర్ బికేసీకేసీని విక్రయించేందుకు అదానీ రియాల్టీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదానీ గ్రూప్ ఈ బిల్డింగ్ విక్రయం కోసం అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్‌తో సీరియస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అదానీకి చెందిన కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్ ఇన్‌స్పైర్ బికేసీ మెుత్తం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాపర్టీని అమెరికా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా కాలంగా అదానీ గ్రూప్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ విభాగం ఈ ప్రాపర్టీని విక్రయించి 10-అంతస్తుల కార్యాలయ భవనాన్ని మానిటైజ్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని విక్రయానికి అదానీ గ్రూప్ గతంలో బ్రూక్‌ఫీల్డ్ ఇండియా, షాపూర్జీ పల్లోంజీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌తో సహా దేశవిదేశాల్లోని ప్రముఖ పెట్టుబడిదారులతో చర్చలు జరిపింది.
బ్లాక్‌స్టోన్ గ్రూప్ కూడా ఇంతకుముందు ఆస్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. చాలా సంవత్సరాల తర్వాత అదానీ రియల్టీ మళ్లీ ఆస్తిని కొనుగోలు చేయడానికి అమెరికా సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో అనిశ్చితి కారణంగా 2020లో చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరగడంతో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతం విలువ పెరిగింది. కాబట్టి ఈ ప్రాపర్టీని కొనేందుకు అమెరికా పెట్టుబడి సంస్థ తన ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications