Adani News: ఫ్రెంచ్ కంపెనీతో చేతులు కలిపిన అదానీ.. భారీ ఒప్పందం వివరాలు..
Adani News: తన మీద.. తన వ్యాపారాల మీద ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినప్పటికీ గౌతమ్ అదానీ మాత్రం తగ్గేదే లే అంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ క్రమంలో గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ ఎస్‌ఈతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం కొత్త జాయింట్ వెంచర్‌లో 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది. 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్ ప్రాతిపదికన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పెట్టుబడులను పెడుతున్నట్లు స్టాక్ మార్కెట్లకు అందించిన వివరాల ప్రకారం వెల్లడైంది.

ఈ కొత్త జాయింట్ వెంచర్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ లిమిటెడ్(AGE23L) 1050 MWని కలిగి ఉంది. ఇందులో ఇప్పటికే పనిచేస్తున్న 300 మెగావాట్లు ఉంది. అదనంగా 500 MW నిర్మాణంలో, 250 MW అభివృద్ధిలో ఉంది. ఇందులో సోలార్, విండ్ ఎనర్జీ రెండూ ఉంటాయని కంపెనీ ప్రకటించింది. గతంలో హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో టోటల్ ఎనర్జీస్ SE అదానీ గ్రూప్‌తో 4 బిలియన్ డాలర్ల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి రెండు కంపెనీలు జతకట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టోటల్ ఎనర్జీస్ SE అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.75 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ తర్వాత రెండవ అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. కంపెనీలో ప్రస్తుతం 56.27 శాతం వాటాలు ప్రమోటర్ల వద్ద ఉన్నాయి. దీనికి తోడు అదానీ గ్రూప్ కు చెందిన మరో కంపెనీ అదానీ టోటల్ గ్యాస్‌లో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications