Gautam Adani: గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశంలోని అగ్రవ్యాపారవేత్తల్లో ఒకడిగా ఉన్న గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిరంతరం విస్తరిస్తూనే ఉన్నారు. కీలక రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించటానికి ఉన్న కొనుగోలు అవకాశాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కన్ను మరో కంపెనీపై పడింది.
వివరాల్లోకి వెళితే.. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో మెజారిటీ వాటాల కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అదానీ కంపెనీని దక్కించుకోవటానికి మార్గం సుగమం అయ్యింది. దీంతో ITD సిమెంటేషన్ ఇండియాలో 72.64% వాటాను కొనాలని అదానీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ కోసం అదానీ ఏకంగా రూ.5,757 కోట్లను ఆఫర్ చేస్తున్నారు. తాజాగా కాంపిటీటివ్ కమిషన్ దీనికి రూట్ క్లియర్ చేయటంతో అదానీ కిట్టీలోకి మరో కంపెనీ వచ్చి చేరనుంది.

కొనుగోలుదారు అయిన అదానీ సంస్థ రెన్యూ ఎగ్జిమ్ DMCC దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రిజిస్టర్ చేయబడింది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సంస్థ. ఇది భారీ సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు ఇండియాతో పాటు అనేక దేశాల్లో కార్యకలాపాలను కలిగి ఉంది. అందుకే మౌలిక సదుపాయాల రంగంపై దృష్టి సారించిన అదానీ ఐటీడీ కంపెనీ కొనుగోలు కోసం చాలా కాలంగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
అక్టోబర్ 2024లో Renew Exim DMCC.. ITD సిమెంటేషన్ ప్రమోటర్ అయిన ఇటాలియన్-థాయ్ డెవలప్‌మెంట్ పబ్లిక్ కంపెనీతో కంపెనీలో 46.64% వాటాను రూ.3,204 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. కంపెనీ 4,46,64,772 పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఇది ITD సిమెంటేషన్ ఇండియాలో దాదాపు 26% వాటాకు సరిసమానమైనది. అలాగే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి ఐటీడీ సిమెంటేషన్ ఇండియా ఆర్డర్ బుక్ పైప్ లైన్ రూ.18 వేల కోట్లకు దగ్గరగా ఉండటం గమనార్హం. 2024 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీ సిమెంటేషన్ ఆదాయం రూ.7,542 కోట్లుగా ఉండగా కంపెనీ లాభం రూ.274 కోట్లు వద్ద నమోదైంది.
ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీ తాజాగా ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో కీలక వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం వాటాను దాని ప్రమోటర్ల నుంచి రూ.3,204 కోట్లకు ఒక్కో షేరుకు రూ.400 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం వెల్లడైంది. ఇదే క్రమంలో ఐటీడీ సిమెంటేషన్ పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదానీ గ్రూప్ ఒక్కో షేరుకు రూ.571.68 చొప్పున కొనుగోలుతో మరో 26 శాతం వాటాను పొందాలని చూస్తోంది. దీనికోసం రూ.2,553 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా అదానీ తన ఫోకస్ ప్రస్తుతం భారతదేశంలోని సిమెంట్ వ్యాపారంలో కేంద్రీకరించారు. దీంతో 2022 నుంచి చేపడుతున్న వరుస కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా దానిని తీర్చిదిద్దారు. ఈ ప్రయాణంలో మెుదటి స్థానంలో కొనసాగుతున్న బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ ను అధిగమించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణంలో 2022లో అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీల్లో వాటాలను కొన్నారు. దీని తర్వాత హైదరాబాదుకు చెందిన పెన్నా సిమెంట్స్ ను రూ.10,422 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువకు కొనుగోలు చేయగా.. దాని తర్వాత సీకే బిర్లాకు చెందిన ఓరియంట్ సిమెంట్ లో కూడా కీలక వాటాలను దక్కించుకున్నారు. అయితే నిరంతర కొనుగోళ్లు అదానీని సిమెంట్ వ్యాపారంలో కీలక ఆటగాడిగా తీర్చిదిద్దాయి.


Click it and Unblock the Notifications