Gautam Adani: ఆ కంపెనీపై అదానీ కన్ను.. వాటాల కొనుగోలు వార్తతో 20% అప్, మీ దగ్గర ఉందా..?
ITD Cementation India: కీలకమైన మౌలిక సదుపాయాల రంగంలో ఇప్పటికే అదానీ అనేక పెట్టుబడులను కలిగి ఉన్నారు. పవర్, గ్యాస్, ట్రాన్స్ మిషన్, గ్రీన్ ఎనర్జీ, రియల్టీ, పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్, డేటా సెంటర్లు, సిమెంట్స్, సెమీకండక్టర్స్ వంటి అనేక రంగాల్లో ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యాన్ని సుస్థిర పరచుకుంటున్నరు. ఇతర దేశాల్లో ఉన్న వ్యాపారాలు అక్కడి ఆర్థిక అస్థిరతల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ అదానీ తన షాపింగ్ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గించటం లేదని మరో సారి రుజువవుతోంది.
నేడు స్టాక్ మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఐటీడీ సిమెంటేషన్ ఇండియా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. అయితే ఈ భారీ జంప్ వెనుక పెద్ద ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఈ కంపెనీ ప్రమోటర్లకు చెందిన 46.64 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ అతిపెద్ద పోటీదారుగా అవతరించిందని నివేదికలు వెల్లడించాయి. వార్త మార్కెట్లోకి రావటంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు.

20 శాతం పెరుగుదలను చూసిన తర్వాత నేడు ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.565.60 ధర వద్ద ప్రయాణాన్ని ముగించాయి. అయితే ఉదయం స్టాక్ ధర రూ.523 వద్ద ప్రారంభమైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన చర్చలు జూలై నుంచి కొనసాగుతున్నాయి. ఇటాలియన్ థాయ్ డెవలపర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ITD సిమెంటేషన్‌లో తన యాజమాన్య వాటాను విక్రయించడం గురించి చర్చలు జరుగుతుండగా వాటిని గౌతమ్ అదానీ గ్రూప్ దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడైంది. ఇది కంపెనీ షేర్లను వేగంగా పెంచుతోంది. ప్రస్తుతం మొత్తం ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలుస్తోంది. అయితే వారం ప్రారంభంలో వాటా కొనుగోలుపై ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రూ.5,888.57 కోట్లతో వాటాను కొనుగోలు చేసేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.
గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే అక్టోబర్ 2023లో ఒక్కో షేరు ధర కేవలం రూ.87.10 వద్ద ఉండేది. అప్పటి నుంచి కంపెనీ షేర్లు 189 శాతం పెరిగి పెట్టుబడిదారులు భారీ లాభాలను చూశారు. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 2024లో 90 శాతం రాబడిని ఇచ్చింది. నేడు బీఎస్ఈలో కంపెనీ 52 వారాల గరిష్ట ధర రూ.589.65కి షేర్ ధర ఎగబాకింది. దీనికి ముందు గత నెలలో కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.1.70 డివిడెండ్ లాభాన్ని అందించింది.
కంపెనీ చరిత్ర..
ఐటీడీ సిమెంటేషన్ భారతదేశం స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశానికి చెందిన గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ఇది వాస్తవానికి UKలో ఉన్న EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్స్ట్రక్షన్) కంపెనీ. గడచిన అనేక సంవత్సరాలుగా కంపెనీ యాజమాన్యం పలుమార్లు మార్చబడింది. ఈ కంపెనీ ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణ ల్యాండ్‌స్కేప్‌లో ప్రముఖ ఆటగాడిగా కొనసాగుతోంది. ఇది అదానీ వ్యూహాత్మక పెట్టుబడిగా విశ్లేషకులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల వ్యాపారంలో అగ్రగామి స్థానానికి అదానీ గ్రూప్ చేరుకునేందుకు ఇది దోహదపడుతుందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications