ముఖేష్ అంబానీ మళ్లీ వెనక్కి..ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. ఇద్దరి సంపద ఎంతంటే..
భారతీయ వ్యాపార రంగంలో ఇద్దరు దిగ్గజాలైన గౌతమ్ అదానీ , ముఖేష్ అంబానీ మధ్య సాగుతున్న సంపద యుద్ధం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. అదానీ గ్రూప్ షేర్ల విలువలో కనిపిస్తున్న అనూహ్య వృద్ధి కారణంగా.. గౌతమ్ అదానీ మరోసారి ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
తాజా గణాంకాల ప్రకారం.. అదానీ నికర ఆస్తి విలువ దాదాపు 92.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఈ మార్పుతో భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే అగ్రస్థానాన్ని అదానీ కైవసం చేసుకున్నారు. ప్రపంచంలోని టాప్ 500 బిలియనీర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ప్రస్తుతం 19వ స్థానంలో కొనసాగుతున్నారు.

గౌతమ్ అదానీ ప్రస్థానం ఒక సాధారణ వ్యాపారవేత్త నుండి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు విశేషమైనది. ఆయన మొదటి తరం పారిశ్రామికవేత్తగా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ నెట్‌వర్క్, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, విమానాశ్రయాల నిర్వహణలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అదానీ గ్రూపునకు చెందిన పది ప్రధాన కంపెనీల్లో ఆయనకున్న వాటాలే ఈ సంపద వృద్ధికి మూలాధారం.
ముఖ్యంగా దేశంలో జరుగుతున్న ఇంధన పరివర్తన, మౌలిక సదుపాయాల విస్తరణపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం అదానీ షేర్లను భారీగా పెంచింది. మరోవైపు, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం, రిటైల్, ఇంధన రంగాల్లో బలంగా ఉన్నప్పటికీ, వాటి స్టాక్ మార్కెట్ వృద్ధి అదానీ గ్రూపుతో పోలిస్తే నెమ్మదిగా ఉండటం వల్ల ర్యాంకింగ్‌లలో ఈ మార్పు చోటుచేసుకుంది.
గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య అగ్రస్థానం కోసం దోబూచులాట సాగుతోంది. దశాబ్ద కాలం పాటు భారత్‌లో నంబర్ 1గా ఉన్న అంబానీని, 2022 ప్రారంభంలో అదానీ మొదటిసారి అధిగమించారు. అయితే, అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా పడిపోవడంతో అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. కానీ, అదానీ గ్రూప్ అసాధారణ రీతిలో పుంజుకుని మౌలిక సదుపాయాలు, సిమెంట్, మీడియా మరియు డేటా సెంటర్ల వంటి వైవిధ్యభరిత రంగాలలో తన పట్టును నిరూపించుకుంది. దీని ఫలితంగానే 2024 మరియు 2025 మధ్య కాలంలో పలుమార్లు అగ్రస్థానం మారుతూ వచ్చి, ప్రస్తుతం మళ్లీ Gautam Adani పైచేయి సాధించారు.
ప్రపంచ ధనవంతుల జాబితాను పరిశీలిస్తే.. భారతీయులకు, అంతర్జాతీయ దిగ్గజాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏకంగా 656 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవగా, లారీ పేజ్, జెఫ్ బెజోస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసక్తకిర అంశం ఏంటంటే ప్రపంచ టాప్ 50 ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకున్న భారతీయులు అదానీ మరియు అంబానీ మాత్రమే.
అదానీ గ్రూప్ నేడు రక్షణ రంగం నుండి ఎఫ్‌ఎంసిజి వరకు అనేక రంగాల్లో విస్తరించి, 200 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించిన తొలి భారతీయ మొదటి తరం పారిశ్రామిక సామ్రాజ్యంగా చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాకుండా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ రంగం పోషిస్తున్న కీలక పాత్రకు ప్రతిబింబంగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications