AI on IT: ప్రస్తుతం భారతదేశంలో ప్రపంచ ఐటీ సేవలకు హబ్ గా మారింది. తక్కువ వేతనాలకు పనిచేసే వర్కర్స్ అందుబాటులో ఉండటంతో అనేక దేశాలకు చెందిన జీసీసీలు సైతం ఇండియాలో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితులు కనిపించటం లేదు. టెక్ రంగంలో వస్తున్న మార్పులపై తాజా నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2027 నాటికి ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దాదాపు 80 శాతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ పనిచేయడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని గార్ట్‌నర్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఎందుకంటే AI సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, వినియోగాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగంలో కొత్త రోల్స్, స్కిల్స్ అవతరిస్తాయని రిపోర్ట్ వెల్లడించింది. దీనికి తగినట్లుగానే ఇప్పటికే టాప్ టెక్ కంపెనీలైన ఐబీఎమ్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఉద్యోగులను తగ్గిస్తూ వారి పాత్రల్లో ఏఐ టూల్స్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న కాలంలో ఏఐ మనుషులను పూర్తిగా రీప్లేస్ చేయగలదనే ఆందోళనలు ఉన్నప్పటికీ, మానవ సృజనాత్మకత నైపుణ్యం ఎల్లప్పుడూ ముఖ్యమైనవని రిపోర్ట్ చెబుతోంది.

వాస్తవానికి ఏఐ ఇంజనీర్ల పని విధానాన్ని మారుస్తుందని గార్ట్‌నర్‌లోని సీనియర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ ఫిలిప్ వాల్ష్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇంజనీర్లు వినూత్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి AIతో కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇంజనీర్ల ఉత్పాదకతను పెంచటానికి ఏఐ ఉపయోగపడుతుందని, పైగా వారి ఉత్పాదకతను పెంచుతుందని రిపోర్ట్ పేర్కొంది. అలాగే ఇంజనీర్‌లు తమ పనిని ఎక్కువ ఆటోమేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్ వంటి నైపుణ్యాలు కొత్త తరం ఇంజనీర్లకు చాలా ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి.
సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఉండే టెక్ కంపెనీలకు ఏఐ, మెషిన్ లెగ్నింగ్ వంటి నైపుణ్యాలు ఉండే ఉద్యోగుల అవసరం మరింతగా పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్కిల్స్ ఉన్న పాత్రలకు కంపెనీల్లో అధిక డిమాండ్ ఉన్నట్లు గార్ట్‌నర్ సర్వేలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌ను మార్చినప్పటికీ, నైపుణ్యం కలిగిన కొత్త తరం డెవలపర్‌ల అవసరాన్ని అది భర్తీ చేయదని గార్ట్‌నర్ నివేదిక సూచిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న మెజారిటీ ఉద్యోగులు ఏఐ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరాన్ని తాజా రిపోర్ట్ నొక్కి చెబుతోంది. మారుతున్న ఐటీ రంగంలోని అవసరాలను అందిపుచ్చుకుని, టెక్ రంగంలో మంచి వేతనాలతో ముందుకు సాగాలంటే తప్పనిసరిగా ఫ్రెషర్లు ఏఐ సాంకేతికతలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.


Click it and Unblock the Notifications