నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలంటూ కొత్త ఉద్యమం.. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు అంటూ పుట్టుకొచ్చిన E20 జనతా పార్టీ
దేశ రాజధాని రాజకీయాల్లో ఇటీవల పరీక్షల రచ్చతో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో, ఇప్పుడు E20 జనతా పార్టీ అనే కొత్త ఆన్‌లైన్ వేదిక తెరపైకి వచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వల్ల వాహనదారుల్లో చెలరేగుతున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని.. ఈ నూతన వర్గం సామాజిక మాధ్యమాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, ప్రభుత్వ విధానాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం ప్రారంభించింది.
ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకించడం లేదని చెబుతున్నప్పటికీ.. వినియోగదారులకు ప్రత్యామ్నాయంగా 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు అనే నినాదంతో ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌ల వేదికగా వీరు చేస్తున్న డిజిటల్ ఉద్యమం యువతను, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మరోవైపు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ గణనీయంగా తగ్గిపోతోందని, ఇంజిన్లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్, వ్లోగర్ సౌరవ్ జోషి తన మెర్సిడీజ్ బెంజ్ ఎస్‌యూవీలో E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజీ తగ్గి ఇంజిన్ సమస్యలు వచ్చాయని బహిరంగంగా తెలపడంతో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. అయితే దీనిపై స్పందించిన మెర్సిడీజ్-బెంజ్ ఇండియా సంస్థ తమ బీఎస్6 పెట్రోల్ వాహనాలు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని వివరణ ఇచ్చింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో E20 ఇంధన భద్రతపై జరుగుతున్న చర్చ మరింత వేడెక్కింది.
ఈ ఆందోళనలు, విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E20 ఇంధన వినియోగాన్ని గట్టిగా సమర్థించారు. ప్రభుత్వం బయోఫ్యూయల్స్, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రజలను మళ్లించే విషయంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇంధన రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలనే 'ఆత్మనిర్భర్ భారత్' విజన్‌లో భాగంగానే ఈ ఇథనాల్ బ్లెండింగ్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. E20 పెట్రోల్ అనేది పాత, కొత్త వాహనాలు రెండింటికీ పూర్తి సురక్షితమైనదని ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా వాహనాల్లో సాధారణంగా వచ్చే మెకానికల్ సమస్యలను నేరుగా ఇథనాల్ బ్లెండింగ్‌కు ఆపాదించడం సరైన పద్ధతి కాదని గడ్కరీ వ్యాఖ్యానించారు. వాహన యజమానులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే ముందుగా వాటిని నిపుణులతో తనిఖీ చేయించుకోవాలని.. ఇంధనం వల్లే సమస్య వచ్చిందని అనవసర నిందలు వేయకూడదని సూచించారు. ఈ వ్యవహారంలో వాస్తవాల కంటే తప్పుడు సమాచారం, అనవసర రాజకీయ గందరగోళమే ఎక్కువగా ప్రచారం పొందుతోందని ఆయన ఆరోపించారు. ఒకవైపు ప్రభుత్వ ఇంధన భద్రతా లక్ష్యాలు, మరోవైపు వినియోగదారుల మైలేజీ ఆందోళనల మధ్య ఈ వివాదం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications
