క్రూడాయిల్ దిగుమతి మన దేశానికి అతి పెద్ద ఆర్థిక సవాలుగా మారుతోందని, అంతర్జాతీయంగా నెలకొంటోన్న పరిణామాలతో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ.. మన వాణిజ్య లోటును మరింత పెంచుతున్నాయని, ఈ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కార్ల తయారీకి ప్రయత్నించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.
'న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్' పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయో ఫ్యూయల్ తయారీ కోసం వ్యవసాయాన్ని పవర్, ఎనర్జీ దిశగా మళ్లించి బయో ఫ్యూయల్ తయారీకి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయంలో వాహన తయారీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు.
''పాత తయారీ విధానంతోపాటు ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల తయారీని మేం ప్రోత్సహిస్తాం. ఈ రంగానికి ఎల్లప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వం తరుపున మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం.. అని పేర్కొన్న గడ్కరీ.. క్రూడాయిల్‌కు ప్రత్యామ్నాయంగా.. దిగుమతి పరంగా, కాలుష్య రహితంగా, సరైన ధర ఉండే విధానమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేబినెట్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ అడ్వయిజరీకి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు కూడా చెప్పారు.

మూలధన ఖర్చులో 20 శాతం అదే...
మన మూలధన ఖర్చులో 20 శాతం దిగుమతులే ఉంటాయని, అదే దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సవాలుగా మారుతోందని గడ్కరీ అన్నారు. టొయోటా, హ్యూందాయ్ వంటి పాపులర్ బ్రాండ్స్ బ్రెజిల్‌లో ఫ్లెక్సి ఇంజిన్లను తయారు చేస్తున్నాయని తెలుపుతూ.. ఇండియాలో ఇలాంటివి ఎందుకు ప్రయత్నించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల కొనుగోలు పట్ల వినియోగదారులు ఎల్లప్పుడూ మక్కువ చూపుతారని, వాహన తయారీదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని గడ్కరీ అన్నారు.
అగ్రికల్చర్ డైవర్సిఫై అవసరం...
ప్రభుత్వానికి మంచి ఆదాయం అందిస్తూ.. ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోన్న రంగాల్లో ఆటోమొబైల్ రంగం కూడా ఒకటని కొనియాడిన మంత్రి ఈ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. క్రూడాయిల్ దిగుమతులతోపాటు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోన్న మరో పెద్ద సమస్య.. వ్యవసాయ రంగంలో బియ్యం, గోధుమలు, చెరకు అత్యధికంగా ఉత్పత్తికావడం అని గడ్కరీ చెప్పారు. ఈ విషయంలో అగ్రికల్చర్ సెక్టార్‌ను డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా దీనిని మళ్లించాలని ఆయన చెప్పారు.
రోజుకు 30 కిలోమీటర్ల రోడ్డు...
ప్రస్తుతం రోజుకు 30 కిలోమీటర్ల దూరం రోడ్డు వేసే స్థాయికి మన చేరుకున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు 22 కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేలను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రూ.50 వేల కోట్లను వెచ్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రూ.9 వేల కోట్లతో ఏర్పాటు చేయబోయే మీరుట్ ఎక్స్‌ప్రెస్ హైవే.. వచ్చే మార్చికల్లా పూర్తి అవుతుందని తెలిపారు.
తుది దశలో పాత వాహనాల స్క్రాప్ పాలసీ...
పాత వాహనాల స్క్రాపింగ్‌కు సబంధించిన పాలసీ తుది దశలోో ఉందని, ఈ పాలసీ వచ్చిన తరువాత ఇండియా అతి పెద్ద ఆటోమొబైల్ హబ్‌గా మారిపోతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. అలాగే గిరిజన ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయబోయే రూ.లక్ష కోట్ల ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి 60 శాతం కాంట్రాక్ట్‌లు ఇవ్వడం పూర్తయిందని, దేశ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications