future: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(FRL)కి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మరియు డైరెక్టర్ గా వ్యవహరించిన కిషోర్ బియానీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనవరి 23న ఈ మేరకు లేఖను పంపించారు. కాగా నెలన్నర తరువాత దానిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కంపెనీ ఈ మేరకు వెల్లడించింది.

రాజీనామాపై అభ్యంతరం:
కంపెనీ ప్రస్తుతంం దివాలా ప్రక్రియలో ఉండగా.. బియానీ లేఖలోని అంశాలపై రిజల్యూషన్ ప్రొఫెషనల్(RP) అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరారు. అందుకు అంగీకరిస్తూ మార్చి 10న కిషోర్ స్పందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు మార్చి 14న RP ద్వారా ధృవీకరణ సైతం లభించినట్లు పేర్కొంది.

అంతా అయిపోయింది:
కంపెనీని రిజల్యూషన్ ప్రొఫెషనల్ నియంత్రణకు అప్పగించేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తిచేసినట్లు బియానీ తన రాజీనామాలో పేర్కొన్నారు. ఇంతకు పూర్వం నిర్వహణ, మాజీ ఉద్యోగులు, థర్డ్ పార్టీలకు సంబంధించిన అన్ని వ్యాపార కార్యకలాపాలతో పాటు మేనేజ్ మెంట్ ఎదుర్కొన్న వివిధ ఆటుపోట్ల గురించి సైతం తెలిసినంత వరకు వివరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో తన నుంచి ఏ సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ కారణం:
FRL రుణదాతలు దాదాపు రూ.15 వేల కోట్లు నష్టపోవడంపై రిజల్యూషన్ ప్రొఫెషనల్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)ను ఆశ్రయించింది.
ప్రస్తుత, మాజీ డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఓ దరఖాస్తును దాఖలు చేసింది. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలో బియానీ రాజీనామా వెనక్కి తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications