Big Bazaar: మూడు నెలల్లో వ్యాపారం నేలమట్టం.. రూ.7,000 కోట్ల వ్యాపార నష్టం..
దేశంలో డీమార్ట్ స్టోర్లు ప్రజలకు ఎక్కువగా చేరువ కాని సమయంలో బిగ్ బజార్ స్టోర్లు కళకళలాడేవి. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ అత్యధికంగా అప్పట్లో ప్రజాధరణ పొందింది.
కానీ కరోనాతో కథ మెుత్తం మారిపోయింది. అసలు కంపెనీ విజయవంతంగా ముందుకు సాగతున్న స్థితి నుంచి ఎలా పతనం అయ్యిందనే దానిపై ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు CEO, కిషోర్ బియానీ, యూట్యూబర్ రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది, దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్-అమెజాన్‌ల మధ్య జరిగిన గొడవలో బిగ్ బజార్ ఎలా చిక్కుకుపోయిందో వెల్లడించారు.

సాంకేతికతను వినియోగించటం, కస్టమర్ల అనుభవాన్ని పెంచటంలో తాము ముందు వరుసలోనే ఉన్నట్లు బియానీ అన్నారు. రిటైల్‌లో ఎఫ్‌డిఐని అనుమతించలేదు కాబట్టి తాము కోరుకున్నంత మేరకు కంపెనీలోకి ఎఫ్‌డిఐని పొందలేకపోయామన్నారు. అయితే తన నాయకత్వంలో కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను విస్తరించిందన్నారు. అయితే కొవిడ్-19 వ్యాపారాలను ప్రభావితం చేసిన తరుణంలో ఫ్యూచర్ గ్రూప్ కూడా అందులో చిక్కుకుందని పేర్కొన్నారు. కొవిడ్ సంభవించినప్పుడు మూడు నెలల్లో రూ.7,000 కోట్ల వ్యాపారం కోల్పోయినట్లు చెప్పారు.
ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులు కావటంతో కోలుకోవడం చాలా కష్టంగా మారుతుండటంతో.. వాటిని సెటిల్ చేసి వ్యాపారాన్ని అమ్ముకోవటం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు బియానీ చెప్పారు. ఇదే క్రమంలో రిలయన్స్-అమెజాన్ మధ్య గొడవ కంపెనీ కష్టాలను మరింతగా క్షీణింపజేసిందని పేర్కొన్నారు. వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించేందుకు రిలయన్స్‌తో చేసుకున్న ఒప్పందం చట్టపరమైన చిక్కుల్లో పడిందని దీంతో తాము కోరుకున్నట్లుగా పనులు ముందుకు సాగలేదని చెప్పారు. ఫ్యూచర్‌తో దాని ఒప్పందాలు ఫ్యూచర్ ఆస్తులపై ప్రత్యేక హక్కులను ఇచ్చాయని అమెజాన్ వాదించింది.
ఈ వివాదం ఇంకా కొనసాగుతున్నందున కంపెనీ లిక్విడేషన్ ప్రక్రియ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద ఉందన్నారు. ఏప్రిల్ 2022లో రుణదాతలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించిన తర్వాత దాదాపు రూ.25,000 కోట్లకు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు తన ఒప్పందాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. అలా కంపెనీ కాలగర్భంలో కలిసిపోయింది.


Click it and Unblock the Notifications