రిలయన్స్ బ్యాలెన్స్ షీట్లు పటిష్టం, వారిదే భవిష్యత్తు: ముఖేష్ అంబానీ
సాంకేతికతకు అనుగుణంగా ముందుకు కదిలేవారిదే భవిష్యత్తు అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ జియో, రిటైల్, ఆయిల్ టు కెమికల్స్ హైబర్ గ్రోత్ ఇంజిన్స్ అన్నారు. తమ బలం కూడా డిజిటల్ అన్నారు. బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు రిలయన్స్ వార్షిక నివేదికలో ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ వల్ల రుణాలను ముందస్తుగా చెల్లించడంతో తమ బ్యాలెన్స్ షీట్లు మరింత పటిష్ఠమై, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మొత్తం అందుబాటులో ఉందన్నారు.

ఈ నిధులు ఉపయోగపడతాయి
జియో, రిటైల్, ఆయిల్ టు కెమికల్స్ వృద్ధి ప్రణాళికలకు ఈ నిధులు ఉపయోగపడతాయని ముఖేష్ అంబానీ చెప్పారు. డిజిటల్ విప్లవాన్ని విజయవంతంగా అందిపుచ్చుకునే సంస్థలదే భవిష్యత్తు అన్నారు. 2020-21లో టెలికాం, డిజిటల్ వ్యాపారాల విభాగం జియో ప్లాట్ ఫామ్స్ (రూ.1,52,056 కోట్లు), రిలయన్స్ రిటైల్ సంస్థ (రూ.47,625 కోట్లు)ల్లో మైనార్టీ వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్లు, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు, ఇంధన రిటైలింగ్‌లో 49 శాతం వాటా విక్రయం ద్వారా రూ.7629 కోట్లను సమీకరించినట్లు చెప్పారు. దీంతో రుణరహిత సంస్థగా తమ లక్ష్యం కంటే ముందే గత మార్చి నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించిందన్నారు.

సౌదీ ఆరామ్‌కోకు వాటా విక్రయం
ఆ ఏడాది ఆర్బీఐ నుండి అవసరమైన అనుమతులు తీసుకొని విదేశీ కరెన్సీ రూపంలో 7.8 బిలియన్ డాలర్ల రుణాన్ని ముందుగా చెల్లించామని, ఒక భారతీయ కార్పొరేట్ కంపెనీ ముందస్తుగా చెల్లించిన అత్యధిక రుణం ఇదే అన్నారు. ప్రపంచంలో గత 10 సంవత్సరాల బ్యాంకింగేతర సంస్థల విభాగంలో జరిగిన అతి పెద్ద రైట్స్ ఇష్యూ తమదే అన్నారు. ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోందన్నారు.

సవాళ్లు ఎదురైనా...
గత సంవత్సరం కరోనా రూపంలో సవాళ్లు ఎదురైనా, రిలయన్స్ తన అన్ని వ్యాపార విభాగాల్లో వృద్ధి ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసిందని, కరోనాపై పోరాటానికి ఆసుపత్రుల నిర్మాణంతో పాటు పీపీఈ కిట్స్, ఆక్సిజన్ సరఫరా వంటివి చేస్తున్నామని, రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలు డిజిటల్ సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాతో దేశానికి ఉపయోగపడ్డాయన్నారు.


Click it and Unblock the Notifications