డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ ఈ త్రైమాసికంలో దాదాపు 2 శాతం మేర క్షీణించింది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల్లో ఈ క్వార్టర్‌లో అత్యంత ఎక్కువగా పతనమైన కరెన్సీ రూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే వచ్చే మార్చి చివరి నాటికి రూపాయి 76.50కి పడిపోతుందని బ్లూమ్ బర్గ్ సర్వే ద్వారా వెల్లడైంది. దేశీయ మార్కెట్ నుండి ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో రూపాయి బలహీనపడింది. ప్రస్తుత త్రైమాసికంలో గ్లోబల్ ఫండ్స్ భారత మార్కెట్ నుండి 4.2 బిలియన్ డాలర్ల క్యాపిటల్‌ను వెనక్కి తీసుకున్నాయి.

మరింత క్షీణించే అవకాశం
భారత ఈక్విటీ అంచనాలను ఇటీవల గోల్డ్ మన్ శాక్స్ గ్రూప్ ఇంక్, నోమురా హోల్డింగ్స్ ఇంక్ తగ్గించింది. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ స్టాక్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఒమిక్రాన్ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన పడుతుందని అంచనా వేయడంతో పెట్టుబడులు వెనక్కి పోయాయి. రికార్డ్ స్థాయి వాణిజ్యలోటు, ఫెడరల్ రిజర్వ్‌తో సెంట్రల్ బ్యాంకు పాలసీ వైవిధ్యం కూడా రూపాయి క్షీణత పైన ప్రభావం చూపాయి. ద్రవ్య విధాన వైవిధ్యం, పెరుగుతున్న కరెంట్ ఖాతా అంతరం సమీప కాలంలో రూపాయిలో క్షీణతకు కారణంగా మారువచ్చునని చెబుతున్నారు.

ఆర్బీఐకి సవాల్
రూపాయి విలువ క్షీణించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పెద్ద సవాల్. అయితే కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణ నేపథ్యంలో బలహీనమైన కరెన్సీ ఎగుమతులకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దిగుమతి ద్రవ్యోల్భణాన్ని పెంచుతుంది. అలాగే, వడ్డీ రేట్లను రికార్డ్ కనిష్టస్థాయి వద్ద ఎక్కువ కాలం కొనసాగించడానికి కష్టమవుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి డాలర్ మారకంతో రూపాయి 76కు పడిపోవచ్చునని కొన్ని ఆర్థిక సంస్థలు పేర్కొంటుండగా, 78 స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదని క్వాంటార్ట్ మార్కెట్ సొల్యూషన్ నిపుణులు అంటున్నారు. గతంలో ఏప్రిల్ 2020న 76.9088 వద్ద రికార్డ్ కనిష్టాన్ని తాకింది. బ్లూమ్ బర్గ్ సర్వేలో మాత్రం 76.50కి పడిపోతుందని వెల్లడైంది.

మరింత క్షీణిస్తుందా?
ఈ ఏడాది రూపాయి 4 శాతం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయని, వరుసగా ఇది నాలుగో ఏడాది అని చెబుతున్నారు. సెన్సెక్స్ అక్టోబర్ ఆల్ టైమ్ గరిష్టం నుండి ఇప్పటికే పది శాతం వరకు క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు మరింత పడిపోయే అవకాశాలు లేకపోలేదనే అంచనాల నేపథ్యంలో ఈ త్రైమాసికంలో 587 మిలియన్ డాలర్ల బాండ్స్ ఔట్ ఫ్లో కనిపించింది. అధిక దిగుమతుల నేపథ్యంలో నవంబర్ నెలలో భారత వాణిజ్య లోటు ఆల్ టైమ్ గరిష్టస్థాయి 23 బిలియన్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications