Fund houses cheating: ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. రిస్క్ ఉంటుందని తెలిసినా వాటిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఇతర వాటితో పోలిస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇచ్చే సత్తా వీటికి ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాగా ఎటువంటి మోసాలు జరగకుండా పెద్దన్న సెబీ అండ ఎలాగో ఉంటుందనే భరోసా మరో రీజన్‌గా తెలుస్తోంది.
జూన్ 4న భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. దాదాపు 30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆ తర్వాత రోజు మళ్లీ తిరిగి పుంజుకోవడంతో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రెండు రోజులపై తీవ్ర దుమారం చెలరేగింది.

పెట్టుబడిదారుల సంపద ఆవిరి కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే అదేరోజున ఆయా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ఇన్వెస్టర్లకు యూనిట్లు కేటాయించడంలో జాప్యం చేశాయి. తద్వారా తిరిగి మార్కెట్లు పుంజుకున్న సమయంలో సంభావ్య లాభాలను కోల్పోయినట్లు పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 లోపు తమ ఖాతాకు బదిలీ అయిన మొత్తానికి అదేరోజు యూనిట్లు కేటాయించాలి. ఎన్నికల ఫలితాల రోజున BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావించిన ఇన్వెస్టర్లు ఆ కట్-ఆఫ్ సమయంలోపు 'లమ్సమ్' పద్ధతిలో ఇన్వెస్ట్ చేశారు. జూన్ 4వ తేదీ యూనిట్లను కేటాయించిన పలు ఫండ్ హౌస్‌లు 5వ తేదీని ప్రామాణికంగా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు.
దాదాపు 6 మిలియన్ మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు ఇలా ఆలస్యంగా ప్రాసెస్ చేయబడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల రోజున మార్కెట్ పతనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన వారి ఆశలపై ఫండ్ హౌస్‌లు నీళ్లు చల్లాయని ఇన్వెస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పలువురు సెబీకి ఫిర్యాదులు చేశారు. వాటిపై నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


Click it and Unblock the Notifications