చమురు ధరలు పెరుగుదల.. ఖర్చులు భరించలేకున్నాం.. వెంటనే వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్..
అమెరికా-ఇజ్రాయెల్, Iran మధ్య పెరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉండడంతో ఆసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి దేశాలు ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు, దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు అనేక చర్యలు ప్రకటించాయి. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, పాఠశాలలను మూసివేయడం, రిమోట్ వర్క్ ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.
ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి హార్ముజ్ జలసంధి మూసివేత. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ సముద్ర మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్గం ద్వారా చమురు రవాణా అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో చమురు ధరలు తక్షణమే ప్రభావితమవుతాయి. అందువల్ల ఆసియా దేశాలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాయి.

పాకిస్తాన్ ఇప్పటికే కఠిన చర్యలు ప్రకటించింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ వ్యయాన్ని రెండు నెలల పాటు 20 శాతం తగ్గించనున్నట్లు తెలిపారు. మంత్రుల జీతాలను తాత్కాలికంగా నిలిపివేయడం, ప్రభుత్వ వాహనాలకు ఇంధన కేటాయింపును సగానికి తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా రెండు వారాల పాటు పాఠశాలలను మూసివేసి, విశ్వవిద్యాలయాలను ఆన్‌లైన్ తరగతులకు మార్చాలని సూచించారు. నాలుగు రోజుల పని వారాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. గల్ఫ్ దేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడే పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం నాలుగు వారాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
థాయిలాండ్ ప్రభుత్వం కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు సాధ్యమైన చోట రిమోట్‌గా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్లను 26°C వద్ద ఉంచాలని ఆదేశించారు. విదేశీ ప్రయాణాలను తగ్గించాలని అధికారులకు సూచించారు. దేశంలో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నప్పటికీ వాటిని కాపాడుకోవడానికి చమురు ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు.
వియత్నాం ప్రభుత్వం దేశీయ మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు దిగుమతి చేసుకునే కొన్ని పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలను తొలగించింది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు వీలైనప్పుడల్లా ఇంటి నుంచి పని చేయాలని కంపెనీలకు సూచించింది. అయితే సరఫరా తగ్గుదల కారణంగా కొన్ని చిన్న పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేయడం లేదా పని గంటలను తగ్గించడం జరిగింది.
బంగ్లాదేశ్కూడా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇంధన బంకుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడం, పాఠశాలలను మూసివేయడం, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో లైటింగ్‌ను తగ్గించడం వంటి చర్యలు అమలు చేసింది. దేశానికి అవసరమైన చమురు గ్యాస్‌లో దాదాపు 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దేశానికి సుమారు ఒక నెలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీలంకలో పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో ప్రభుత్వం రిటైల్ ఇంధన ధరలను 8 శాతం కంటే ఎక్కువగా పెంచింది. సాధారణంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు LKR 22 పెరిగాయి. ఇది నిల్వలపై ఒత్తిడి తగ్గించడానికి తీసుకున్న చర్యగా పేర్కొన్నారు.
భారతదేశంలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దేశీయ LPG ధరలు సిలిండర్‌కు రూ. 60 పెరిగాయి. సరఫరా నిర్వహణ కోసం వినియోగదారులు రెండు బుకింగ్‌ల మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండేలా నిబంధనలు ప్రవేశపెట్టారు. సరఫరా సమస్యలు కొనసాగితే కొన్ని నగరాల్లో హోటల్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే భారత ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరులపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది.
ఈ పరిస్థితిలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. వెల్స్ ఫార్గో వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కట్టాకం లింక్డ్‌ఇన్‌లో చేసిన సూచనలు ఐటీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేస్తే ప్రయాణానికి ఉపయోగించే ఇంధనాన్ని ఆదా చేసి, దానిని అత్యవసర సేవలకు మళ్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇంధన కొరత ప్రభావం వాణిజ్య రంగంపైనా పడుతోంది. గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ముంబైలో సుమారు 20 శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడగా, బెంగళూరు, చెన్నై నగరాల్లో రెస్టారెంట్లు పని వేళలను తగ్గిస్తున్నాయి. ఇదే సమయంలో జెట్ ఇంధనం ధరలు పెరగడంతో విమాన టిక్కెట్లు కూడా ఖరీదయ్యాయి. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేసినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనాన్ని తెప్పించుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు డిమాండ్ తగ్గించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఒక సమర్థవంతమైన పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల గరిష్ట స్థాయికి చేరుకున్న చమురు ధరలు మంగళవారం కొంత తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 92 డాలర్ల వరకు పడిపోయింది, అలాగే WTI క్రూడ్ కూడా 89 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మధ్యప్రాచ్య వివాదం త్వరలో తగ్గవచ్చన్న ఆశలతో మార్కెట్‌లో కొంత ఊరట కనిపించింది. అయినప్పటికీ, ప్రపంచ ఇంధన సరఫరాలపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications