Fuel Prices: స్థిరంగా పెట్రోల్ ధరలు, ఆ బంకుల్లో రూ.5 ఎక్కువ, ఎందుకంటే
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 01, శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నాయి. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలకు లీటర్ పెట్రోల్ పైన రూ.13.08, డీజిల్ పైన రూ.24.09 నష్టం వాటిల్లుతోంది. దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 108 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 106 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇటీవల క్షీణించాయి.

దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. ఇటీవల చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ పైన నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు అయితే ప్రభుత్వమే నష్టాన్ని భరిస్తుంది. అయితే కొన్ని ప్రయివేటు కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ధరలను స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వరంగ పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉంటే, ప్రయివేటు పెట్రోల్ బంకుల్లో రూ.5 పెంచి, రూ.115 వరకు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications