సిద్ధంగా ఉండండి.. పెట్రోల్ ధరలు రూ.5 వరకు పెరిగే అవకాశం
వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్! వచ్చే నెల (జూన్) నుండి పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ ధరలను ప్రతి రోజు సమీక్షిస్తారనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ నుండి లీటర్ పైన రూ.4 నుండి రూ.5 వరకు పెరిగే అవకాశముంది. మే 31తో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఇప్పటికే జనాలు రోడ్ల పైకి వచ్చారు. జూన్ 1వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించినప్పటికీ రవాణా కొన్ని ఆంక్షలతో సాగుతుంది. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు ధరలను రోజువారీగా సమీక్షిస్తాయి.

జూన్ 1 సమీక్షించి అవకాశం
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు, రోజువారీ ఇంధన ధరల పెంపుపై కార్యాచరణ రూపొందించేందుకు గత వారం ఇంధన రిటైలర్స్ సమావేశమైనట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) తెలిపాయి. ఒకవేళ లాక్ డౌన్ అయిదో దశలోకి ప్రవేశించినా రోజువారీ ధరల సమీక్ష మాత్రం ప్రారంభం కావొచ్చునని తెలుస్తోంది.

ఖర్చు కంటే తక్కువ రాబడి
ప్రస్తుతం చమురు మార్కెటింగ్ కంపెనీలు లాక్ డౌన్ నేపథ్యంలో ఖర్చు కంటే తక్కువ ఆటో ఇంధనాలు విక్రయిస్తూ నష్టాలపాలవుతున్నాయి. గత కొద్ది కాలంగా ఇంధనానికి డిమాండ్ లేదు. ప్రభుత్వం ధరల సమీక్షకు అనుమతిస్తే అప్పుడు నష్టాల బారి నుండి బయటకు వస్తాయి. లాక్ డౌన్‌ను పొడిగించినా మరిన్ని సడలింపులు ఉంటాయని భావిస్తున్నారు. మార్కెట్ నిర్ణయించిన ధరలకే పెట్రోల్, డీజిల్‌ను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించవచ్చునని భావిస్తున్నాయి.

30 డాలర్లకు పైన చమురు ధరలు
గత నెలలో అంతర్జాతీయ మార్కెట్ ధరల కారణంగా చమురు మార్కెట్ కంపెనీలు కొంత లాభాలు ఆర్జించాయి. కానీ డిమాండ్ లేదు. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 30 డాలర్లకు పైగా ఉంది. మరింత పెరిగే అవకాశముంది. ధరలు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ పైన నష్టాలు కొనసాగే అవకాశముంది. పైగా లాక్ డౌన్ కారణంగా డిమాండ్ లేక సేల్స్ పడిపోయాయని గుర్తు చేస్తున్నారు.

అప్పటి వరకు...
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు, విక్రయానికి మధ్య ఇప్పటికే లీటర్‌కు రూ.4 నుండి రూ.5 మధ్య అంతరం ఉంది. అంతర్జాతీయ ధరల్లో పెరుగదలలేనందున రెండు వారాల పాటు రోజుకు 40-50 పైసలు పెంచుకుంటూ పోతే కొద్దికాలంలోనే నష్టాల నుంచి బయటపడవచ్చునని భావిస్తున్నాయట ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. అయితే, రోజువారీ ధరల సమీక్షకు ప్రభుత్వం అనుమతిచ్చినా ఓస్థాయి దాటిన తర్వాత ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోవచ్చనేది ప్రభుత్వ వర్గాల మాట. అప్పుడు కొనుగోలు, విక్రయానికి మధ్య అంతరాన్ని పూడ్చే వరకు రోజుకు గరిష్టంగా 20 పైసల నుండి 40 పైసలకు పెంచుకునే అవకాశం ఉండవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications