పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి: హైదరాబాద్‌లో రూ.91 క్రాస్
రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఫిబ్రవరి 10, బుధవారం) పెరిగాయి. లీటర్‌కు 25 పైసల నుండి 30 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.60కి చేరుకుంది. అదే విధంగా డీజిల్ ధర రూ.77.73కు పెరిగింది. చమురు ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. లీటర్ డీజిల్ పైన 25 పైసలు పెరగగా, లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగాయి. ఇటీవల ఇంధన ధరలు ఎప్పటికప్పుడు రికార్డుస్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో ధరలు
హైదరాబాద్‌లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ.91.09కి చేరుకుంది. డీజిల్ ధర రూ.84.79గా ఉంది. వాణిజ్యరాజధాని ముంబైలో పెట్రోల్ ధర గరిష్టస్థాయిని తాకింది. పెట్రోల్ ధర ఇక్కడ రూ.94.12కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.88.92, చెన్నైలో రూ. 89.96గా ఉంది. డీజిల్ ధర ముంబైలో లీటర్‌కు రూ.84.63, కోల్‌కతాలో రూ.81.31, చెన్నైలో రూ.82.90గా ఉంది. జైపూర్‌లో పెట్రోల్ రూ.93.98, డీజిల్ రూ.85.95గా ఉంది.

2021లో ఎంత పెరిగిందంటే
నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్ పైన 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పైన 3.89, లీటర్ డీజిల్ పైన రూ.3.91 పెరిగింది. అంతర్జాతీయ ధరలు, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తాయి. అయితే వ్యాట్, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. తాజాగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగాను ఇంధన ధరలు పెరిగాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు
సోమవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏప్రిల్ డెలివరీ బ్యారెల్‌కు 60 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ దేశాలు కరోనా నుండి క్రమంగా కోలుకోవడం, ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం వంటి వివిధ కారణాలతో చమురు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇంధన ధరలు అంతర్జాతీయంగా, జాతీయంగా పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications