FSSAI News: ప్యాకేజ్డ్ ఆహారాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం.. ఇకపై అలా చేయాలంటూ..
Processed Foods: ప్రజల ఆధునిక జీవన విధానాలు, పెరిగిన ఆదాయాలతో చాలా మంది ప్రస్తుత రోజుల్లో బయట ప్రాసెస్ చేయబడిన ప్యాకేజ్డ్ ఆహారపదార్ధాలను కొంటున్నారు. రెడీ టూ ఈట్ ప్రాసెస్డ్ ఆహారాలపై ఎక్కువ మక్కువ చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు వారు తినే ఆహారం గురించి పూర్తి అవగాహన కలిగించాలని FSSAI నిర్ణయించింది.
ఈ క్రమంలో ఫుడ్ రెగ్యులేటర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఉప్పు, చక్కెర, సాచురేటెడ్ కొవ్వుకు సంబంధించిన సమాచారాన్ని బోల్డ్ చేయబడిన పెద్ద అక్షరాలతో తప్పక ముద్రించాలని నిర్ణయించింది. దీంతో కంపెనీలు తమ లేబులింగ్ తాజా నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. శనివారం మార్పులకు రెగ్యులేటర్ ఆమోదం తెలపగా.. FSSAI దీనికి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. అలాగే వాటాదారుల నుంచి దీనిపై సలహాలు, సూచనలను కోరనుంది.

ప్రజలు తింటున్న ఉత్పత్తులోని పోషక విలువలను వినియోగదారులు అర్థం చేసుకునేందుకు వీలుగా తద్వారా వారు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సెలెక్ట్ చేసుకునేందుకు ఈ సవరణ ఉద్ధేశించబడింది. పోషకాహార సమాచార లేబులింగ్‌కు సంబంధించి ఆహార భద్రత & ప్రమాణాలు (లేబులింగ్ మరియు డిస్‌ప్లే) నిబంధనలు 2020లో సవరణను ఆమోదించే నిర్ణయం FSSAI చైర్మన్ అపూర్వ చంద్ర అధ్యక్షతన తీసుకున్నారు.
తాజా మార్పులు కొనుగోలుదారులకు ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడానికి వినియోగదారులకు అధికారం ఇస్తాయని కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి తోడు ఈ సవరణ నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (NCDs) వ్యాప్తిని ఎదుర్కోవడానికి, ప్రజారోగ్యం శ్రేయస్సును ప్రోత్సహించే ప్రయత్నాలకు కూడా దోహదపడుతుందని స్పష్టం చేసింది.
జ్యూస్‌కు సంబంధించిన క్లెయిమ్‌లపై కూడా FSSAI కఠినంగా ఉంటుంది. 100 శాతం పండ్ల రసంతో తయారు చేయబడిన జ్యూసెస్ అంటూ కంపెనీలు తమ ప్యాక్ చేసిన ఉత్పత్తులపై లేబుల్‌లను వెంటనే తొలగించాలని కోరింది. అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు కూడా సెప్టెంబర్ 1, 2024 నాటికి ముందుగా ముద్రించిన ప్యాకేజింగ్ మెటీరియల్‌లను దశలవారీగా తొలగించాలని ఆదేశించింది. వాస్తవానికి జ్యూస్ లలో ప్రధానంగా నీరు ఎక్కువగా ఉంటుంది. అయితే క్లెయిమ్ చేసిన పండ్ల రసం సాంద్రత తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications