Ola News: ఓలా షోరూమ్ సిబ్బందికి తేరుకోలేని షాకిచ్చిన కస్టమర్.. పట్టలేని కోపంతో ఏం చేశాడంటే..
Ola electric: రైడ్ హెయిలింగ్ సంస్థగా ప్రవేశించి క్రమంగా వివిధ సర్వీసుల్లోకి ఓలా విస్తరించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సైతం తయారు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే ఇటీవల వాటి పనితీరు, సర్వీసింగ్‌లపై కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఏకంగా షోరూమ్‌కి వెళ్లి మరీ గొడవ పడుతున్నారు.
ఓలా కంపెనీపై కోపంతో ఊగిపోయిన ఓ కస్టమర్.. అక్కడి సిబ్బందికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇటీవల తాను కొనుగోలు చేసిన ఇ-స్కూటర్‌కు సర్వీసింగ్ సంతృప్తికరంగా లేదని ఆరోపించాడు. చిర్రెత్తుకొచ్చిన సదరు వ్యక్తి కర్ణాటకలోని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌కు నిప్పంటించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

'ఘటనకు కారణమైన మహ్మద్ నదీమ్ వృత్తిరీత్యా మెకానిక్. గత నెలలో అతడు ఓలా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత స్కూటర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో దానిని సర్వీసింగ్ కోసం తీసుకెళ్లాడు. కంపెనీ ప్రతినిధులు సర్వీసింగ్ సరిగా చేయలేదని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. నిలదీసేందుకు చాలాసార్లు వెళ్లినా ఉపయోగం లేకపోవడంతో ఈసారి పెట్రోల్ తీసుకువెళ్ళి 6 బైక్‌లకు నిప్పంటించాడు' అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే షోరూమ్ నిర్వహకులకు 8.5 లక్షల మేర నష్టం జరిగినట్లు పోలీసులు లెక్కించారు. గత నెలలోనే ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్‌కు.. ఇదొక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వెబ్‌సైట్ ప్రకారం భారతదేశం వ్యాప్తంగా 431 సర్వీస్ స్టేషన్‌లను ఓలా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications