Frontdesk: కరోనా విజృంభణతో మొదలైన లేఆఫ్స్.. గతేడాది తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే ఎంతోమంది కొలువు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కొత్త ఏడాదైనా శుభవార్తలు వింటామనుకునే ఉద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. సంవత్సరం ప్రారంభమై వారం గడవకే ముందే పలు కంపెనీలు ఉద్యోగాల కోతలు మొదలుపెట్టాయి.
US ఆధారిత ప్రాపర్టీ టెక్ స్టార్టప్ 'ఫ్రంట్‌డెస్క్' తన ఉద్యోగులకు బాహుబలి రేంజ్ షాక్ ఇచ్చింది. రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా దాదాపు 200 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించింది. దాని మొత్తం వర్క్‌ఫోర్స్‌కు ఒక్కసారిగా ఉద్వాసన పలికింది. ఈ సడన్ నిర్ణయంతో సిబ్బంది మొత్తం నిర్ఘాంతపోయారు.

టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. వర్చువల్ మీటింగ్‌లో కంపెనీ CEO జెస్సీ డిపింటో ఉద్యోగులకు ఈ వార్తను అందించారు. ఫుల్ టైం, పార్ట్ టైం కార్మికులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తుపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. దివాలాకు ప్రత్యామ్నాయం దిశగా ఫ్రంట్‌డెస్క్ ఉద్దేశాన్ని ఈ ప్రకటన ద్వారా ఆయన వెల్లడించించారు.
అంతేకాకుండా కస్టమర్లను ఉద్దేశించి ఫ్రంట్‌డెస్క్ తన వెబ్‌సైట్‌లో ఓ సలహా ఇచ్చింది. వినియోగదారులు ప్రత్యామ్నాయ వసతిని వెతుక్కోవాలని, 15 రోజుల్లో తదుపరి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. అయితే అనేక ప్రాపర్టీలకు అద్దె చెల్లింపులతో కంపెనీ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.
2017లో స్థాపించబడిన ఈ సంస్థకు ప్రారంభంలో జెట్‌బ్లూ వెంచర్స్, వెరిటాస్ ఇన్వెస్ట్‌మెంట్స్, సాండ్ హిల్ ఏంజెల్స్ వంటి ప్రముఖు కంపెనీల మద్దతు లభించింది. తద్వారా గణనీయంగా 26 మిలియన్ల పెట్టుబడులను సంపాదించింది. అయితే వరుస పరాజయాలను ఎదుర్కొన్న స్టార్టప్.. తన రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications