Year Ender 2023: ఉద్యోగులను ఇళ్లకు పంపిన టాప్ స్టార్టప్స్ ఇవే..!
Startup News: గడచిన 2023 స్టార్టప్ కంపెనీలకు పెద్ద పీడకల లాంటి ఏడాదిగా చెప్పుకోవచ్చు. అనేక కంపెనీలు ఈ కాలంలో అధిక సంఖ్యల్లో తమ ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్స్ ఇచ్చాయి.
అలాగే 2023 ముగింపు దగ్గరపడుతున్న కొద్దీ భారతీయ టెక్ పరిశ్రమలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ క్రమంలో అనేక కంపెనీలు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. వీటి వెనుక కారణాలను పరిశీలిస్తే.. 2023లో దేశంలోని దాదాపు 100 భారతీయ స్టార్టప్ కంపెనీలు ఏకంగా 15,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక పరిమితులతో సతమతమవుతున్న ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇదే క్రమంలో ఈ-కామర్స్ స్టార్టప్ మీషో సైతం మూడు విడతల్లో భారీగానే ఉద్యోగులను తొలగించింది. అలా కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 15 శాతం మందిని స్టార్టప్ తొలగించింది. ఇదే క్రమంలో B2B ఈ-కామర్స్ యునికార్న్ ఉడాన్ 340 మిలియన్ డాలర్ల మూలధనాన్ని పొందిన కొన్ని రోజుల తర్వాత 150 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఉడాన్ తన సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, తాజా నిధులతో విక్రేత భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రణాళిక వేసింది.
మెుహల్లాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన షేర్‌చాట్, మోజ్ ఈ ఏడాది 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. వచ్చే ఏడాది కంపెనీ లాభదాయకంగా మారి ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా తొలగింపులు వచ్చాయి. అలాగే అంబానీ పెట్టుబడులు పెట్టిన డన్జో వర్క్‌ఫోర్స్‌ను 30% తగ్గించింది. కంపెనీ కొంత కాలంగా సకాలంలో ఉద్యోగులకు, వెండర్లకు పేమెంట్స్ చేసేందుకు కష్టపడుతోంది. ఈ క్రమంలో పెట్టుబడి కోసం నిధుల సేకరణకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది.
అలాగే 2023లో ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ తన ఉత్పత్తి, ఇంజనీరింగ్, ఆపరేషన్ విభాగాలలో 380 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే జెస్ట్ మనీ కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించింది. ఇక ఓలా దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. చివరిగా క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ CoinDCX ఆగస్టులో 12 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా అనేక స్టార్టప్ కంపెనీలు ఫండింగ్ క్రంచ్ తో పాటు ఇన్వెస్టర్ల ప్రెజర్ కారణంగా లాభదాయకతను అందుకునేందుకునే క్రమంగా చాలా మందిని తొలగించాయి.


Click it and Unblock the Notifications