బంగారం ధరలు పెరుగుతాయనే భయంతో ఒకేసారి కొనవద్దు.. వచ్చే ఏడాది పసిడి ధరలపై నిపుణులు బిగ్ అప్‌డేట్
ఈ సంవత్సరం బంగారం పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించింది. ఆర్థిక అనిశ్చితి, వార్-జియోపాలిటికల్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం భయం అన్నీ కలిపి బంగారం ధరలను పరుగులు పెట్టించాయి. దేశీయ మార్కెట్లో Gold ధరలు ఈ సంవత్సరం జనవరి 1న 10 గ్రాములకు రూ. 79,390గా ఉండగా.. డిసెంబర్ 5 నాటికి రూ. 1,32,900కు చేరాయి. అంటే కేవలం 11 నెలల్లో దాదాపు 67శాతం పెరుగుదల నమోదు చేసింది. డబ్బు విలువ తగ్గే సమయంలో, ప్రజలు తమ ఆస్తిని రక్షించుకునే మార్గంగా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు దాదాపు 60 శాతం పెరిగాయి. అయితే భారతదేశంలో బంగారం రాబడి మరింత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రూపాయి బలహీనత. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో, అంతర్జాతీయ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ దేశీయ ధరలు వేగంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, చైనా-అమెరికా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరగడం, రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం వంటి అంశాలు బంగారంపై డిమాండ్‌ను భారీగా పెంచాయి.

ఈ నేపథ్యంలో బంగారం ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్, బాండ్‌లను మించిపోయే పనితీరు కనబరిచింది. నిఫ్టీ 50 TRI కేవలం 6.7 శాతం రాబడి ఇవ్వగా, 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ సుమారు 6.53 శాతం మాత్రమే రాబడి ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం పెట్టుబడిదారులకు ఆర్థిక భద్రతను అందించే ముఖ్యమైన ఆస్తిగా నిలిచింది.
Gold ధరలు ఇంకా ఎక్కడికి చేరవచ్చనే అంచనాను మార్కెట్ నిపుణులు వేస్తున్నారు. రిలిగేర్ బ్రోకింగ్ విశ్లేషకుడు కలాంత్రి అభిప్రాయం ప్రకారం.. 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1.45 లక్షల నుండి రూ. 1.55 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. ప్రపంచ పరిస్థితులు అలాగే కొనసాగితే లేదా రూపాయి మరింత బలహీనపడితే ఈ పెరుగుదల అవకాశాలు మరింత బలపడతాయి. అనంద్ రతి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ డైరెక్టర్ థామస్ స్టీఫెన్ కూడా వచ్చే ఏడాది బంగారం ధరలు మరో 5 శాతం నుండి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా అన్న ప్రశ్నకు బులియన్ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం పెట్టుబడి రక్షణగోడలా పనిచేస్తుంది. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా, క్రమంగా SIPల రూపంలో బంగారు ETFలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమ ఎంపిక. ఇలా gradual accumulation వల్ల ధరలు తగ్గినా, పెరిగినా మీరు సగటు ధరలో పెట్టుబడి కొనసాగించవచ్చు.
భౌతిక బంగారం వ్యక్తిగత, సాంప్రదాయ అవసరాల కోసం మాత్రమే కొంత భాగం ఉండాలి. పెట్టుబడి లక్ష్యాల కోసం అయితే ETFలు, సావరన్ గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్ ఉత్తమ ఎంపికలు అని సూచిస్తున్నారు. నిపుణుల సలహా ప్రకారం.. మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5 శాతం నుండి 10 శాతం బంగారంలో పెట్టుబడి పెట్టాలి. ద్రవ్యోల్బణం పెరుగుతుందని భావించే వారు అది 12 నుంచి 17 శాతం వరకు పెంచుకోవచ్చు.
ఏదేమైనా 2025లో బంగారం పెట్టుబడిదారులకు భారీ లాభాలు ఇచ్చింది. 2026లో కూడా ఇది పెట్టుబడి యొక్క శక్తివంతమైన రక్షణ, లాభదాయకమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. ప్రపంచ పరిస్థితులు ఎలా మారినా, బంగారం పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన మిత్రుడిగానే ఉన్నదని పరిస్థితులు చెబుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications