బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులు ముట్టుకుంటే భగభగమంటూ మండిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడి పేరెత్తాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు నింగిని తాకా దిగిరానంటున్నాయి. అయితే పెట్టుబడిదారులకు మాత్రం ఇది భారీ లాభాలను అందించింది. గత కొన్నేళ్ల నుంచి బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు భారీగా లాభాలను అర్జించారు. కేవలం ఆరేళ్లలోనే పెట్టుబడిదారులు Gold మీద దాదాపు 200 శాతం లాభాన్ని అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు పసిడి మీద భారీ కొనుగోళ్లు, రీటైల్ వ్యాపారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వంటి అంశాలు బంగారాన్ని ఈక్వీటీ షేర్ల కంటే ఎక్కువ డిమాండ్ గా మార్చాయి. గత ఆరేళ్లలో బంగారం ధరలను చూసుకున్నట్లయితే అందరూ పసిడి పెరిగిన తీరు చూసి నోరెళ్లబెట్టాల్సిందే.. మే 2019లో 10 గ్రాముల బంగారం ధర రూ 30వేలు ఉండగా అది 2025 జూలై నాటికి రూ. లక్షకు పైగానే చేరుకుంది. కేవలం ఆరేళ్ల కాలంలో బంగారం ధర దాదాపు రూ. 70 వేలు పెరిగిందంటే దాని ప్రతాపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 200 శాతానికి పైగా పెరిగింది.

ఇదే సమయంలో నిఫ్టీ 50 సూచీ సుమారు 120 శాతం మాత్రమే రాబడిని ఇవ్వగా. 2015 నుండి కూడా బంగారం సెన్సెక్స్, నిఫ్టీ రెండింటికంటే మెరుగైన ఫలితాలను చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం, అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో భౌగోళిక ఉద్రిక్తతలు బంగారాన్ని పెట్టుబడిదారులకు సురక్షితమైన డిమాండ్ గా చూపాయి. ఇక 2019లో కరోనా మహమ్మారితో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పెట్టుబడిదారులు బంగారాన్ని పెట్టుబడి సాధనంగా వాడుకున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో వాణిజ్య యుద్ధ భయాలు కూడా బంగారం పెరుగుదలకు దోహదం చేశాయి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా ఫెడ్, ఇతర కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నందున బంగారం ధరలకు ఇంకా రెక్కలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బంగారం ధరలు పెరిగినా ప్రస్తుత అధిక ధరల వద్ద లాభాల బుకింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. దీర్ఘకాలంలో బంగారం ఇంకా బుల్లిష్‌గా ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్, యా వెల్త్ నిపుణులు చెబుతున్నారు.
యా వెల్త్ డైరెక్టర్ అనుజ్ గుప్తా ప్రకారం.. ఎంసీఎక్స్ Gold.. 2025 దీపావళి నాటికి లక్ష రూపాయల నుంచి లక్షా మూడు వేల రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో బంగారం కొనాలనుకునే వారు వేచి ఉండాలని ధరలు రూ. 96 వేల నుంచి రూ. 98 వేల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఈ ఏడాది రెండవ అర్థభాగంలో రూ. లక్షా 5 వేలకు బంగారం చేరుకుంటుందని చెబుతున్నారు. ఇక వెండి, ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాలపై పెట్టుబడిదారులకు ఉన్న ఆసక్తి కొంతకాలం పాటు బంగారం డిమాండ్‌ను తగ్గించవచ్చు. అయితే సుంకాలు, వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నందున బంగారం డిమాండ్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని అనుజ్ గుప్తా చెబుతున్నారు.
HDFC సెక్యూరిటీస్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ ప్రకారం.. అమెరికా ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆగస్టు 1 వాణిజ్య ఒప్పందాల గడువు వంటి అంశాలు బంగారం పెరుగుదలకు తప్పనిసరిగా కారణమవుతాయని అంటున్నారు. బంగారం కొంత మేర తగ్గుముఖం పట్టినా దీర్ఘకాలంలో మాత్రం భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. పెట్టుబడిదారులు ఆలోచన చేసి ఈ సమయంలో కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. 2025 రెండవ ఆర్థభాగంలో బంగారం బలమైన డిమాండ్ తో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications