Pakistan Crisis: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అధ్వాన్న స్థితిలో ఉంది. గతంలో శ్రీలంక మాదిరిగానే ప్రస్తుతం విదేశీ మారక నిల్వల కొరతను ఎదుర్కొంటోంది. రోజులు గడిచేకొద్ది.. పరిస్థితులు ఎలా మారతాయనే ఆందోళన అక్కడి ప్రజలను నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది.

పాక్ సమస్యలు..
పాక్ పాలకులు చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. ప్రస్తుతం ఆ దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 31 శాతంగా ఉంది. దీనికి తోడు కరెంటు కోతలు, పెరుగుతున్న అప్పుల భారం, ఆహార కొరత, ఇంధన కొరత, గ్యాస్ ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల కష్టాలకు అంతులేదని చెప్పుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగటం ప్రాథమిక అవసరాలు పొందటం కూడా సగటు పాకిస్థానీకి కష్టతరంగా మారింది. వీటి కోసం ప్రజలు బారులు తీరటం, కొట్టుకోవటానికి సంబంధించిన పలు వీడియోలో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి.

ఉగ్ర చీకట్లు..
పాక్ నేతలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత్ ను ఎలా నాశనం చేయాలనే పనిలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. దీంతో ఆర్థికాభివృద్ధి కుంటుబడి దాయాది చీకట్లోకి జారుకుంది. విద్యుత్ గ్రిడ్లు కుప్పకూలటంతో పాక్ లోని చాలా నగరాలు సైతం విద్యుత్ అంతరాయం కారణంగా అంధకారంలో మునిగిపోయాయి. అయితే విద్యుత్ మరమ్మతుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పాకిస్థాన్ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో మూడు రోజుల పాటు పాకిస్థాన్ పార్లమెంట్ పనిచేయలేదని వెల్లడైంది.

ఆర్థిక తిరోగమనం..
ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల వల్ల దాయాది ఆర్థిక తిరోగమనాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా పాకిస్థాన్‌లో మాంద్యం కారణంగా పెట్టుబడులు మందగించాయి. అలాగే పెరుగుదున్న ఇంధన భారం ఆదేశ కరెన్సీ విలువ క్షీణతకు ఆజ్యం పోస్తుందని అంచనా.

పెరిగిన వడ్డీ రేట్లు..
అసలే పరిస్థితులు అగమ్యగోచరంలో ఉంటే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ మరోవైపు తన కీలక బెంచ్ మార్క్ రేటును 100 బేసిస్ పాయింట్లు పెంచి 17 శాతం చేసింది. 1997 తర్వాత వడ్డీ రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి. పాక్ పాతాళ ప్రయాణానికి ఇదొక కారణమని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications