Investment: ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు గ్లోబలైజేషన్ కారణంగా ఒకదానితో మరొకటి ఏదో ఒక రూపంలో ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడులు సైతం పెడుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హత్యతో ఇండియాకు సంబంధం ఉందంటూ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది కాస్త దౌత్య అధికారులను వెనక్కి పంపటం దాకా వెళ్లింది. అయితే ఈ ఉద్రిక్తతలు పెట్టుబడులపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్(CPPIB) ఇండియాలో దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను కలిగి ఉంది. అనేక లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

కెనడా పెన్షన్ ఫండ్ లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ ఢిల్లీవెరీలో 6 శాతం వాటాను కలిగి ఉంది. దీని పెట్టుబడి విలువ దాదాపు రూ.1,878 కోట్లుగా ఉంది. అలాగే ప్రైవేటు బ్యాంకింగ్ కంపెనీ కోటక్ మహీంద్రాలో 1.15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2.68 శాతం వాటాను హోల్డ్ చేస్తోంది. దీని ప్రస్తుత విలువ రూ.9,582 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోలో రూ.2,078 కోట్ల విలువైన 2.37 శాతం వాటాను పెన్షన్ ఫండ్ కలిగి ఉంది.
అలాగే దేశంలో విప్లవాత్మక పేమెంట్స్ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్లలో కెనడా పెన్షన్ ఫండ్ కూడా ఒకటి. కంపెనీలో ప్రస్తుతం 1.76 శాతం వాటాతో రూ.973 కోట్ల పెట్టుబడి కలిగి ఉంది. ఇక ఇండస్ టవర్స్ కంపెనీలో రూ.1,085 కోట్ల విలువైన 2.18 శాతం వాటాను హోల్డ్ చేస్తోంది. చివరగా ఆన్‌లైన్ బ్యూటీ రిటైలర్ నైకాలో యాంకర్ ఇన్వెస్టర్ గా రూ.625 కోట్ల విలువైన వాటాలను హోల్డ్ చేస్తోంది. అలాగే కెనడియన్ ఫండ్స్ విప్రో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లలో కూడా వాటాను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications