H-1B వీసాలపై ట్రంప్ సర్కారు సంచలన నిర్ణయం.. లాటరీ విధానం రద్దు.. అర్హత ఉంటేనే అమెరికాలోకి ఎంట్రీ..
అమెరికాలో ఉద్యోగం చేసి జీవితాన్ని స్థిరపరుచుకోవాలని కలలు కనే లక్షలాది భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో గట్టి షాక్ తగిలింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న H-1B వీసా లాటరీ విధానానికి పూర్తిగా ముగింపు పలుకుతూ.. ప్రతిభ-వేతనం ఆధారంగా వీసాల ఎంపిక చేసే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది. అదృష్టంపై ఆధారపడే రాండమ్ లాటరీ స్థానంలో వెయిటెడ్ సెలక్షన్ అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుండగా.. FY 2027 హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ నుంచే ఈ విధానం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని అనేక కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది. అమెరికన్ ఉద్యోగులతో పోలిస్తే తక్కువ జీతాలకు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి కొంతమంది యజమానులు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. దీని వల్ల అమెరికాలోని వేతనాల స్థాయి తగ్గిపోతుండటమే కాకుండా, స్థానిక ఉద్యోగావకాశాలకు తీవ్ర నష్టం జరుగుతోందని అమెరికా ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాకు నిజంగా ఉపయోగపడే అత్యుత్తమ ప్రతిభావంతులకే వీసాలు అనే లక్ష్యంతో కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త నియమాల ప్రకారం ఇకపై అభ్యర్థి కలిగిన నైపుణ్యాలు, అనుభవం, వారికి ఆఫర్ చేసే జీతం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అత్యధిక వేతనం పొందే ఉద్యోగులు, కీలక రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులకే హెచ్-1బీ వీసా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ప్యాకేజీలతో చేసే ఎంట్రీ లెవల్ లేదా మిడ్-లెవల్ దరఖాస్తులకు అవకాశాలు గణనీయంగా తగ్గనున్నాయి.
అమెరికా తీసుకువచ్చిన ఈ మార్పుల ప్రభావం భారతీయ ఐటీ రంగంపై తీవ్రంగా పడనుంది. ప్రస్తుతం అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో అత్యధిక వాటా భారతీయులదే. ముఖ్యంగా భారతీయ ఐటీ దిగ్గజాలు, అవుట్‌సోర్సింగ్ కంపెనీలు వేల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేస్తూ వస్తున్నాయి. అయితే కొత్త విధానం అమల్లోకి వస్తే, భారీ సంఖ్యలో చేసే తక్కువ వేతన దరఖాస్తులకు బ్రేక్ పడే అవకాశముంది. దీనివల్ల భారతీయ ఫ్రెషర్లు, జూనియర్ ఇంజినీర్లకు అమెరికా వెళ్లే దారి మరింత కఠినంగా మారనుంది.
అలాగే సీనియర్ నిపుణులు, హై-పే ప్యాకేజీలు పొందే టెక్ ప్రొఫెషనల్స్‌కు మాత్రం ఈ విధానం కొంతమేర లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి స్పెషలైజ్డ్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే హెచ్-1బీ వీసా వ్యవస్థలో 'అదృష్టం' అనే అంశాన్ని పూర్తిగా తొలగించి.. 'అర్హత'తోనే అమెరికాకు రావాలని ట్రంప్ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.


Click it and Unblock the Notifications