Monday Markets: కొత్తవారం మార్కెట్లను నడిపించే అంశాలివే.. సూచీలు పతనమా? లాభాల్లో పయనమా?
Market Next Week: దేశీయ స్టాక్ మార్కెట్లు జనవరి నెలను కొత్తవారం చివరికి ముగించనున్నాయి. ఈ క్రమంలో అందరి చూపు మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలపైనే ఉంది. ఈవారం కూడా ఒడిదోడుకుల్లోనే మార్కెట్లు కొనసాగుతాయా లేక నష్టాలను మిగులుస్తాయో అనే భయంలో ఇన్వెస్టర్లు ఉన్నారు. అయితే అనేక కీలక అంశాలు వారిని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.
ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లను అనేక అంశాలు ప్రభావితం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకటనల నుంచి మ్యాక్రో ఎకనమిక్ డేటా వరకు అనేక అంశాలు మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయి. ముందుగా శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే బడ్జెట్ పై భారతీయ మార్కెట్లలో మదుపరుల చూపు కొనసాగుతోంది. ఏఏ రంగాలకు ఆర్థిక మంత్రి వరాల జల్లు కురిపిస్తారనే క్లారిటీ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని వారు భావిస్తున్నారు.

ఇక కొత్త వారంలో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పరిణామం అమెరికా ఫెడ్ పాలసీ మీటింగ్. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపులను కొనసాగిస్తారా లేక వేచి చూసే ధోరణిని కొనసాగిస్తారా అనే ప్రకటన కోసం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు వేచి చూస్తున్నాయి. ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశం కావటంతో చాలా మందిలో ఆతృత కొసాగుతోంది. ట్రంప్ కూడా రేట్ల తగ్గింపును కోరుతున్న వేళ పావెల్ నిర్ణయం ఎలా ఉండనుందనేది తెలియాల్సి ఉంది.
ఇక కార్పొరేట్ కంపెనీలు గడచిన కొన్ని రోజులుగా తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో క్యూ3 ఫలితాలు నిరాశపరచటంపై పెట్టుబడిదారుల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. ఇక ఇదే క్రమంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వారాంతపు, నెలవారీ ఎక్స్పెయిరీ కూడా ఈవారంలోనే ఉండటం వల్ల మార్కెట్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని ఇన్వెస్టర్లు, నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆటో అమ్మకాల డేటా కూడా బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది.
ఇదే క్రమంలో పెట్టుబడిదారులు క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ పెట్టుబడిదారుల డబ్బు ఉపసంహరణ వంచి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ముందుకు సాగాలని నిర్ణయించటంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలోని మదుపరులు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నారు. ఏ క్షణంలో ట్రంప్ ఏ దేశంపై పన్నులు పెంచుతుంది లేదా ఎలాంటి పాలసీ నిర్ణయాలతో ముందుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నారు.
గడచిన వారంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 429 పాయింట్ల పతనం కాగా మరో కీలక సూచీ నిఫ్టీ 111 పాయింట్ల మేర నష్టంతో గడచిన వారాన్ని ముగించాయి. ఈ క్రమంలో అనేక రంగాలు కూడా నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. అయితే గత వారం ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు సూచీలను భారీ నష్టాల నుంచి కాపాడాయి. ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో ఎక్కువగా పెట్టుబడులను పెడుతున్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు కూడా 2.5 శాతం మేర నష్టాన్ని నమోదు చేశాయి. ఈవారం కూడా మార్కెట్లలోకి ఐపీవోల రాక కొనసాగుతున్న వేళ కొంత రద్దీ వాతావరణం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications