ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి నాగలి పట్టారు.. సేంద్రీయ విప్లవంతో వ్యవసాయాన్ని పరుగులు పెట్టిస్తున్నారు..
సేంద్రీయ ఆహారం ఇప్పుడు ఒక విలాసం కాదు.. ఒక అవసరంగా మారుతోంది. మన ఆహారం, నీరు, గాలిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆరోగ్యంపై ప్రభావం తీవ్రంగా పడుతోంది. అయితే మెట్రో నగరాల్లో లభించే సేంద్రీయ ఉత్పత్తులు చాలా మందికి ధరల కారణంగా అందుబాటులో ఉండడం లేదు. ఈ సమస్యకు ఒక సరళమైన కానీ ప్రభావవంతమైన పరిష్కారంతో ముందుకొచ్చారు అంకుర్ సచన్ - రష్మి సచన్ దంపతులు. వారి ఆలోచన నుంచే పుట్టిందే తుహి ఫార్మ్స్.
నాలుగు సంవత్సరాల క్రితం వరకు అంకుర్, రష్మి ఇద్దరూ బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్స్ గా స్థిరపడ్డారు. అంకుర్ NIT వరంగల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఫ్లిప్‌కార్ట్, SAP, IBM వంటి ప్రముఖ సంస్థల్లో పని చేశారు. రష్మి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దాదాపు పదేళ్ల పాటు ఆయిల్ & గ్యాస్ రంగంలో పనిచేశారు. వృత్తిపరంగా విజయవంతమైన జీవితం సాగుతున్న సమయంలో కోవిడ్ వారి ఆలోచనలను పూర్తిగా మార్చేసింది.

2021లో ప్రసూతి సెలవుల సమయంలో రష్మి తన స్వస్థలమైన కాన్పూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ప్రపంచం ఎలా మారిపోయిందో, ఆహారం, భద్రత, ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆమె గమనించారు. అప్పుడే "మనమే మన ఆహారాన్ని పండించుకుంటే? అనే ఆలోచన మొదలైంది. కుటుంబానికి చెందిన కాన్పూర్ సమీపంలోని చతురి పూర్వా గ్రామంలో ఉన్న పూర్వీకుల భూమిని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
వ్యవసాయ అనుభవం లేని వీరిద్దరూ మొదట శిక్షణలు, వర్క్‌షాప్‌లు, రైతులతో చర్చల ద్వారా నేర్చుకున్నారు. తప్పులు చేశారు, మళ్లీ సరిదిద్దుకున్నారు. మొత్తం 15 ఎకరాల భూమి ఉన్నప్పటికీ.. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా నెమ్మదిగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మొదట కేవలం 5.5 ఎకరాల్లోనే సాగు ప్రారంభించారు. గోధుమ, ఆవాలు, పసుపు వంటి పంటలతో పాటు మామిడి, జామ, బొప్పాయి, ఉసిరి, దానిమ్మ వంటి పండ్ల చెట్లను నాటారు. మొదటి ఏడాదిలోనే 500కు పైగా చెట్లు నాటారు. ప్రస్తుతం వారి పొలంలో 30-35 రకాల చెట్లు ఉన్నాయి. ఏకపంట సాగు కాకుండా, వైవిధ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు.
మొదటి సవాలు నేల ఆరోగ్యం. సేంద్రీయ కార్బన్ కేవలం 0.3 శాతం మాత్రమే ఉండడంతో, వర్మీకంపోస్ట్, ఆవు పేడ, వేప పిడకలు, ఎర్రమట్టితో నేలను పునరుద్ధరించారు. రసాయనాలు వాడకూడదనే నిర్ణయంతో ప్రతిదీ చేతితోనే చేశారు. ప్రారంభంలో కస్టమర్లు లేరు. స్నేహితులు, బంధువులే మొదటి వినియోగదారులు. ధృవపత్రాలు లేకపోయినా, పారదర్శకతనే ఆయుధంగా చేసుకున్నారు. ప్రజలను పొలానికి ఆహ్వానించి, ఎలా పండిస్తున్నారో చూపించారు. ధరలను మార్కెట్ కంటే కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఎక్కువగా ఉంచారు.
సుమారు రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన తుహి ఫార్మ్స్, నేడు నెలకు 200 నుంచి 300 ఆర్డర్లు పొందుతోంది. నెలవారీ ఆదాయం రూ.40 నుంచి 50 వేల మధ్యలో ఉంది. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని, ఫామ్-టు-ఫోర్క్ మోడల్‌లో నేరుగా కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. లాభాల కంటే ఆరోగ్యాన్ని ముందుంచిన ఈ ప్రయాణం.. సేంద్రీయ ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలి అనే సందేశాన్ని బలంగా చాటి చెబుతోంది.


Click it and Unblock the Notifications