ముంబైకి చెందిన ఒక ఆటో డ్రైవర్ ఆటోను నడపకుండానే నెలకు రూ.5 నుంచి 8 లక్షల వరకు సంపాదిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు అతను గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. ముంబై పోలీసులు ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ పై చర్యలు తీసుకున్నారు. అతను ఎటువంటి అనుమతి లేకుండా అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ఆస్తులను రక్షించే వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడని చెప్పి, అమెరికా రాయబార కార్యాలయం నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు.
కథ ఏంటంటే.. రాహుల్ రూపానీ ఇటీవల ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. అతని బ్యాగ్, సెల్ ఫోన్ అక్కడ అనుమతించకపోవడంతో వాటిని నిల్వ చేయడానికి లాకర్లు లేవని తెలుసుకున్నాడు. ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న అతను ఓ ఆటో డ్రైవర్ ని సంప్రదించాడు. ఆడ్రైవర్ మీ వస్తువులను మీరు వచ్చేవరకు జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అయితే భద్రంగా ఉంచిన వస్తువులను మీకు తిరిగి ఇవ్వడానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తానని చెప్పాడు.

ఈ కథనాన్ని రాహుల్ రూపానీ తన లింక్డ్ఇన్ పేజీలో ఒక ఫోటోతో దీన్ని పోస్ట్ చేశారు, ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆటో డ్రైవర్ చాతుర్యాన్ని చాలా మంది ప్రశంసించారు. అతను యుఎస్ ఎంబసీ వెలుపల తన ఆటోను పార్క్ చేసి, డ్రైవింగ్ చేయకుండా డబ్బు సంపాదించడంపై నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి యుఎస్ ఎంబసీకి వచ్చే వారు తమ వస్తువులను అతనికి అప్పగించి, లోపలికి వెళ్లి, వీసా కోసం దరఖాస్తు చేసుకుని, దానిని తీసుకోవడానికి తిరిగి రావడం ప్రారభించారు. ఈ వ్యాపారం ద్వారా అతను నెలకు రూ.5 నుంచి రూ. 8 లక్షలు సంపాదిస్తుంటంతో పోలీసుల కన్ను పడింది.
ముంబై పోలీసులు ఆటో డ్రైవర్‌ను కూడా విచారణ కోసం పిలిపించారు. భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ఎటువంటి వాహనాలను పార్క్ చేయడానికి అనుమతి లేదని, ప్రయాణీకులను ఎక్కించుకోవడానికి, దింపడానికి మాత్రమే ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లను అనుమతిస్తారని పోలీసులు వివరించారు. అయితే, ఈ ఆటో డ్రైవర్ తన పర్మిట్‌ను ఉల్లంఘించి ఇక్కడ పనిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
దీంతో ముంబై పోలీసులు ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ పై చర్యలకు ఉపక్రమించారు. ఆ డ్రైవర్ ఎటువంటి అనుమతి లేకుండా అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ఆస్తులను రక్షించే వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడని చెప్పి.. అమెరికా రాయబార కార్యాలయం నుండి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. దీంతో సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అయిన ఆటో డ్రైవర్ కాస్తా ఇప్పుడు మళ్లీ ఆటో తోలుకోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు రూ.8 లక్షలు కాదు కదా రోజుకు రూ. 500 వస్తే చాలు భగవంతుడా అని అనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications