Adani Power: గతేడాది మొత్తం అదానీ చుట్టూ హిండెన్ బర్గ్ రూపంలో ఉచ్చు బిగుసుకుంది. ఎట్టకేలకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సమర్థవంతంగా ఆ గండం గట్టెక్కారు. కాగా ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. నల్ల బంగారం మరకలు అంటుకుంటున్నాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టాంగెడ్‌కో) విషయంలో అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును అత్యంత ఖరీదైన ఇంధనంగా విక్రయించి లావాదేవీలు జరిపినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) సంస్థ సేకరించిన పత్రాలతో కూడిన నివేదికలు ప్రముఖ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. 'అదానీ గ్రూప్ తక్కువ గ్రేడ్ బొగ్గును విద్యుత్ తయారీ కోసం మండిస్తోంది. ఎక్కువ ఇంధనాన్ని తగలబెట్టడం గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తద్వారా బంపర్ లాభాలను పొంది ఉండవచ్చు' అని రిపోర్ట్ పేర్కొంది.
నివేదిక ప్రకారం.. జనవరి 2014లో ఇండోనేషియాకు చెందిన బొగ్గును 3 వేల 500 కేలరీలు/కిలో చొప్పున అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీన్ని నౌకల ద్వారా తమిళనాడులోని టాంగెడ్కోకు రవాణా చేసి 6 వేలు కేలరీలు/కిలో అత్యంత విలువైన గ్రేడ్ బొగ్గుగా విక్రయించారు. ఈ విధంగా గౌతమ్ అదానీ రెట్టింపు కంటే ఎక్కువ లాభాలను ఆర్జించారు.
తమ సంస్థపై వచ్చిన ఆరోపణలు, మీడియా నివేదికలను అదానీ గ్రూప్ ఖండించింది. లోడింగ్ మరియు డిశ్చార్జ్ సమయంలో బొగ్గు నాణ్యతను స్వతంత్రంగా పరీక్షించామని తెలిపింది. కస్టమ్స్ అధికారులు మరియు టాంగెడ్‌కో శాస్త్రవేత్తలు సైతం టెస్ట్ చేశారని వివరణ ఇచ్చింది. ఈ ఆరోణలు నిరాధారమని, పూర్తిగా అసంబద్ధమని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications