Atos collapse: కాలానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ కాకుంటే ఎంతటి వ్యక్తి లేదా కంపెనీ అయినా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. గతంలో ఓ వెలుగు వెలిగిన పెద్ద పెద్ద కంపెనీలు సైతం చిన్న తప్పటడుగులతో కనిపించకుండా పోయాయి. అప్పట్లో వ్యాపార దిగ్గజంగా మార్కెట్‌ను శాసించిన IT కంపెనీ ఇప్పుడు ఘోర పరిస్థితికి దిగజారింది.
అనేక IT ప్రొవైడర్ల విలీనంతో 1997లో స్థాపించబడిన క్లౌడ్, బిగ్ డేటా మరియు సైబర్ సెక్యూరిటీ సేవల ప్రొవైడర్ అటోస్ ఇప్పుడు కీలక దశలో ఉంది. రుణాలు ముంచుకు వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకానొక సమయంలో ఫ్రెంచ్ వ్యాపార ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ.. వరుస పొరపాట్ల కారణంగా ఘోరంగా దిగజారిపోయింది. చివరకు పతనం అంచుకు చేరింది.

అప్పట్లో అణు పరిశ్రమకు, ఒలింపిక్స్ కు అతిపెద్ద సరఫదారుల్లో అటాస్ ఒకటి. 2011లో సిమెన్స్ IT సొల్యూషన్ అండ్ సర్వీసెస్, 2014లో ఫ్రెంచ్ సూపర్ కంప్యూటింగ్ లీడర్ బుల్, జిరాక్స్ ITO, 2018లో US ప్లేయర్ సింటెల్ ను కొనుగోలు చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగి 2017 నాటికి ఫ్రాన్స్ బ్లూ చిప్ CAC 40 ఇండెక్స్ లోకి ప్రవేశించింది.
2022 నాటికి సంస్థ ఆదాయం 12.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు లక్షా 5 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే USకు చెందిన ప్రత్యర్థి DXC టెక్నాలజీని 10 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడంలో విఫలం కావడం సహా అనేక తప్పటడుగులు వేసింది. అన్నీ కలిసి సంస్థ కంపెనీ పతనానికి కారణమయ్యాయి. ఇప్పుడు రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైతే మొత్తం ఫ్రైంచ్ IT సేవల రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
2021లో అకౌంటింగ్ లోపాలు బయటపడటంతో అటోస్ మార్కెట్ విలువ 1 బిలియన్ యూరోల కంటే ఎక్కువ నష్టపోయింది. గత రెండున్నరేళ్లలో ఐదుగురు వేర్వేరు CEOలను మార్చడంతో ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లింది. కోర్ బిజినెస్ క్లౌడ్ కంప్యూటింగ్ లో నెమ్మదిగా ఉండటంతో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పోటీదారులు కస్టమర్లను ఆకర్షించాయి. చివరకు లాభాలు క్షీణించి, మార్కెట్ క్యాప్ తగ్గిపోయింది. 2.4 బిలియన్ యూరోల రుణ భారం మిగిలింది.
ప్రస్తుతం తన IT వ్యాపారాన్ని విక్రయించే అవకాశాన్ని సంస్థ పరిశీలిస్తోంది. క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీ యూనిట్ గురించి 1.8 బిలియన్ యూరోల కోసం ఎయిర్ బస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. రుణాలను రీఫైనాన్స్ చేయాలంటూ కోర్టు నియమించిన మధ్యవర్తితోనూ చర్చలు జరుపుతోంది. 2025లో చెల్లించాల్సిన 2.4 బిలియన్ యూరోల రుణాన్ని పరిష్కరించడానికి పునర్నిర్మాణ ప్రయత్నాలు చేపట్టింది. ఇవి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి మరి!


Click it and Unblock the Notifications