adani: ఫ్రాన్స్ కంపెనీని తాకిన అదానీ సంక్షోభం.. ఏ సంస్థ, ఎంత నష్టమంటే..
adani: గత నెల నుంచి అదానీ సంక్షోభం భారతీయ మార్కెట్లను ముంచెత్తుతోన్న సంగతి తెలిసిందే. పెట్టుబడిదారుల లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఈ వ్యవహారం పార్లమెంటులో సైతం ప్రకంపనలు రేపుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే అదానీ పడవ మునక.. విదేశాలకూ తీవ్ర నష్టం కలగజేసింది.

లక్షన్నర కోట్లు హాంఫట్:
అదానీ గ్రూపు కారణంగా ఫ్రాన్స్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ భారీ నష్టాన్ని చవిచూసినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. రూ.1.55 లక్షల కోట్లు మేర ఈ విదేశీ కంపెనీ మునిగిపోయినట్లు పేర్కొంది. దీనికి కారణమేమిటంటే, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) సహా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL)లో టోటల్ ఎనర్జీస్ కు పెద్దఎత్తున వాటాలు ఉండటమేనని వెల్లడించింది.

అయినా తగ్గేదేలే.
.
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల అనంతరం అదానీ గ్రూపు షేర్లలో భారీ పతనం ఏర్పడింది. తద్వారా ఆయా కంపెనీలు దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావం అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఫ్రెంచ్ సంస్థపైనా పడింది. కానీ తమ హోల్డింగ్ ను ఏమాత్రం తగ్గించుకోమని టోటల్ ఎనర్జీస్ CEO పాట్రిక్ ఫోయిన్ తెలిపారు. సంక్షోభం తాత్కాలికమేనని, తమ పెట్టుబడులు తిరిగి పొందేందుకు కొతం సమయం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ ఆ కంపెనీ షేర్ హోల్డింగ్:
డిసెంబర్ త్రైమాసికం వరకు టోటల్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లకు పైగా లాభాలతో ఉంది. అయితే టోటల్ గ్రూపు పూర్తిగా కొనుగోలు చేసిన Acme ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ కు అదానీ కంపెనీలో వాటా ఉంది. టోటల్ రెన్యూవబుల్స్ యూనివర్సల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ సైతం ఫ్రెంచ్ సంస్థ కొనుగోలు చేయగా.. దీనికి సైతం అదానీ గ్రీన్ ఎనర్జీలో 16.4 శాతం వాటా ఉంది. అంటే అప్పటి మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.31 వేల కోట్లన్నమాట.

ఇంత జరిగినా నిలబడింది:
ఇంత జరిగినా హిండెన్ బర్గ్ నివేదిక టోటల్ ఎనర్జీస్ షేర్ ధరలపై గ్లోబల్ మార్కెట్లలో తక్కువ ప్రభావం చూపినట్లు చెప్పుకోవచ్చు. 148 బిలియన్ యూరోల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ షేర్ ధర గత నెలలో 59.98 యూరోల వద్ద స్థిరంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ అదానీ సంక్షోభానికి ఇంకెన్ని కంపెనీలు బలి కానున్నాయోనని ఆందోళన నెలకొందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications