iPhone: ఐఫోన్ విక్రయాలపై ఫ్రాన్స్ నిషేధం.. ఆ సమస్య తలెత్తడంతో మొబైల్స్ రీకాల్?
iPhone: యువతలో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ లో ఒక ఐఫోన్ అయినా సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. సెక్యూరిటీ పరంగా అత్యద్భుత పనితనం కనబరిచే ఐఫోన్ లో.. ప్రమాదకర స్థాయిలో రేడియేషన్ లెవల్స్ ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తమ దేశంలో ఐఫోన్ 12 మోడల్ విక్రయాలను ఫ్రాన్స్ నిలిపివేసింది. ఈ ఫోన్లలో రేడియేషన్ లెవల్స్ అనుమతికి మించిన స్థాయిలో ఉన్నట్లు ఆరోపించింది. సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చైనా ఫోన్లపై SAR ఆరోపణలు ఉన్నాయి కానీ ఆపిల్ మొబైల్స్ పై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఐఫోన్ 12 విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ఫ్రాన్స్ రేడియేషన్ మానిటరింగ్ ఏజెన్సీ AFNR ఇప్పటికే ఆపిల్ కంపెనీకి సమాచారం ఇచ్చింది. ఈ మోడల్ ఫోన్లలో స్పెసిఫిక్ అబ్సార్ప్షన్ రేట్ (SAR) స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తమ పరీక్షల్లో తేలినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే సమస్య కేవలం ఐఫోన్ 12కు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది.
మొత్తం ఫ్రెంచ్ మార్కెట్ నుంచి ఈ మోడల్ ఫోన్లను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ఫ్రాన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొంది. ఇదేకాక విక్రయించబడిన ఐఫోన్ 12 మోడళ్లను రీకాల్ చేయించడానికి సైతం సిద్ధంగా ఉంది. ఈ ఆరోపణలను ఆపిల్ ఖండించింది. సదరు మోడల్ గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, ఇదే విషయాన్ని పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ధృవీకరించాయని ప్రకటించింది.


Click it and Unblock the Notifications