బెంగళూరు ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 30 వేల మంది నియామకం..80 శాతం మంది మహిళా ఉద్యోగులే..
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ (ఫాక్స్‌కాన్) భారతదేశంలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వ్యవధిలోనే దాదాపు 30 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది.దీంతో భారత పారిశ్రామిక రంగంలో అరుదైన రికార్డును సృష్టించింది. ఇది దేశంలో ఇప్పటివరకు చూసిన అత్యంత వేగవంతమైన ఫ్యాక్టరీ స్కేల్-అప్‌గా ఆర్థిక వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ఆపిల్ తన తయారీ కేంద్రాలను చైనాకు మించి ఇతర దేశాలకు విస్తరించాలనే వ్యూహంలో భాగంగా భారత్ కీలక స్థానంలో ఉందని ఈ నియామకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ మార్పులు, సరఫరా గొలుసు భద్రత అంశాల నేపథ్యంలో, భారత్ ఆపిల్ గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది. దేవనహళ్లిలో 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫాక్స్‌కాన్ సౌకర్యం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పనిచేసే శ్రామిక శక్తిలో సుమారు 80 శాతం మహిళలే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 19 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల యువతులు కాగా, చాలామంది తొలిసారిగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇది మహిళా ఉపాధి సృష్టిలో ఈ ప్రాజెక్టు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చూపిస్తోంది.

ఈ ప్లాంట్ 2025 ఏప్రిల్-మే నెలల్లో ట్రయల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించింది. మొదట ఐఫోన్ 16 మోడళ్లను అసెంబుల్ చేసిన ఈ యూనిట్, ఆ తర్వాత తాజా ఐఫోన్ 17 ప్రో మాక్స్ తయారీకి మారింది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో 80 శాతం కంటే ఎక్కువ విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత, ఈ యూనిట్‌లో ఉద్యోగుల సంఖ్య 50 వేల వరకు పెరగవచ్చని అంచనా. క్యాంపస్‌లో ఇప్పటికే ఆరు పెద్ద డార్మెటరీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం మహిళా ఉద్యోగుల కోసం వినియోగంలో ఉంది. మిగిలిన వసతి, మౌలిక వసతుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పూర్తిగా విస్తరించిన తర్వాత, ఒకే ప్రాంగణంలో అత్యధిక సంఖ్యలో మహిళా కార్మికులను ఉపాధిలో ఉంచే కేంద్రంగా ఇది మారవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టును కేవలం ఫ్యాక్టరీగానే కాకుండా, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్యా సంస్థలు, వినోద సౌకర్యాలతో కూడిన స్వయం సమృద్ధిగల టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేయాలన్నది ఫాక్స్‌కాన్ లక్ష్యం. ఉద్యోగులకు ఉచిత వసతి, సబ్సిడీ భోజనం అందిస్తున్నారు. సగటున నెలకు సుమారు రూ.18 వేల జీతం లభిస్తుండటం, బ్లూ-కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు లభిస్తున్న అత్యధిక వేతన స్థాయిలలో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ బెంగళూరు ప్రాజెక్టులో ఫాక్స్‌కాన్ దాదాపు రూ.20,000 కోట్ల పెట్టుబడి పెట్టుతోంది. ఇది పూర్తిగా కార్యాచరణలోకి వచ్చిన తర్వాత, ఉపాధి, ఉత్పత్తి సామర్థ్యంలో భారతదేశంలోనే అతిపెద్ద కర్మాగారంగా అవతరించే అవకాశముంది. ఉత్పత్తి విభాగం మాత్రమే సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం నాలుగు ఐఫోన్ అసెంబ్లీ లైన్లు పనిచేస్తుండగా, భవిష్యత్తులో డజను లైన్ల వరకు విస్తరించాలన్న ప్రణాళిక ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం ఈ విజయానికి కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications


