తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం Foxconn మరోసారి భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. iPhone తయారీకి కీలక సరఫరాదారుగా ఉన్న ఈ సంస్థ, తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,500 కోట్లు) పెట్టుబడిని భారత్‌లో చేసినట్లు తెలిపింది. ఈ పెట్టుబడిని Foxconn యొక్క సింగపూర్ కేంద్రిత యూనిట్, భారత ఉపకంపెనీ అయిన Yuzhan Technology Indiaలో 12.7 బిలియన్ షేర్ల కొనుగోలు రూపంలో పెట్టినట్లు వెల్లడించింది.
Yuzhan Technology ఇప్పటికే తమిళనాడులో స్మార్ట్‌ఫోన్లకు అవసరమైన విడి భాగాలను తయారు చేస్తోంది. Apple సంస్థ కోసం iPhone భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ యూనిట్‌కి ఇప్పుడు మరింత విస్తరణపై దృష్టి సారించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న Apple వ్యూహంలో భాగం గానే ఈ భారీ పెట్టుబడులను ప్రకటించింది.

కాగా గత వారం Foxconn-HCL గ్రూప్ జాయింట్ వెంచర్‌కు నోయిడా విమానాశ్రయం సమీపంలో సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మాణానికి భారత ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. రూ. 3,700 కోట్లతో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఆటోమొబైల్, పీసీలు మొదలైన పరికరాల కోసం డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌ల తయారీకి కీలక కేంద్రంగా మారనుంది.
ఈ ఫ్యాక్టరీ ప్రతినెల 20,000 వెఫర్లు (wafers) తయారు చేయగలదు. నెలకు 36 మిలియన్ యూనిట్ల అవుట్‌పుట్ సామర్థ్యం గల కెపాసిటీతో ఉంది. ఇది భారత్‌లో సెమీకండక్టర్ రంగంలో వస్తున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 5 సెమీ కండక్టర్ యూనిట్లు చివరి దశలో ఉన్నాయి. Foxconn ఈ 6వ యూనిట్‌ను ప్రారంభించడంతో, భారత్ టెక్నాలజీ స్వావలంబన దిశగా మరింత ముందడుగు వేయబోతుందని తెలుస్తోంది.
Applied Materials, Lam Research వంటి అంతర్జాతీయ దిగ్గజ తయరీ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు Merck, Linde, Air Liquide, Inox వంటి కెమికల్, గ్యాస్ సరఫరాదారులు కూడా భారత్ లో తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి.ఇక విద్యా, స్టార్టప్ రంగాల్లో కూడా విశేష చైతన్యం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 270 విద్యాసంస్థలు, 70 స్టార్టప్‌లు నూతన డిజైన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుండగా, వాటిలో 20 సంస్థలు విద్యార్థుల తయారుచేసిన చిప్ డిజైన్‌లు ఇప్పటికే taped out అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ పెట్టుబడులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిఫెన్స్ సిస్టమ్స్, మెడికల్ పరికరాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాల్లో భారత్ పుంజుకుంటున్న నేపథ్యంలో, Foxconn లాంటి పెట్టుబడులు భారతీయ టెక్నాలజీ భవిష్యత్తుకు మార్గనిర్దేశకంగా నిలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications