IPO News: ఈ వారం మార్కెట్లోకి అడుగు పెడుతున్న 4 ఐపీవోలు.. పూర్తి వివరాలు
Upcoming IPO's: చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు క్యూ కట్టాయి. ఈ వారం ఏకంగా నాలుగు ఐపీవోలు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.
మార్కెట్లోని రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం నాలుగు ఐపీవోలు తెరవబడతాయి. ఈ వారం ఇవి సందడి చేయనున్నాయి. ప్రస్తుతం ఆత్మజ్ హెల్త్‌కేర్, HMA ఆగ్రో ఇండస్ట్రీస్, వీఫిన్ సొల్యూషన్స్, ఎస్సెన్ స్పెషాలిటీ ఫిల్మ్స్ కంపెనీలు అరంగేట్రం చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ఐపీవో వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆత్మజ్ హెల్త్‌కేర్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నడుపుతున్న సంస్థ. దీని ఐపీవో జూన్ 19 నుంచి జూన్ 21 వరకు సబ్‌స్క్రిప్షన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచి ఉంటుంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.38.40 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ రూ.5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 64 లక్షల షేర్లను జారీ చేస్తోంది. జూపిటర్ హాస్పిటల్స్ పేరు కింద కంపెనీకి గుజరాత్ వడోదరలో హాస్పిటల్స్ వ్యాపారం ఉంది. కంపెనీ ఈ మెుత్తాన్ని వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
HMA ఆగ్రో ఇండస్ట్రీస్ IPO జూన్ 20 నుంచి జూన్ 23 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.480 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.555 నుంచి రూ.585గా నిర్ణయించింది. మెుత్తం ఐపీవోలో రూ.150 కోట్లు తాజా ఇష్యూ ఉండగా మిగిలిన రూ.330 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ఇది జూలై 4న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానుంది.
మార్కెట్లోకి వస్తున్న మరో ఐపీవో VFin సొల్యూషన్స్. ఇది డిజిటల్ లెండింగ్ అండ్ సప్లై చైన్ ఫైనాన్స్ టెక్నాలజీ కంపెనీ. దీని IPO జూన్ 22న ప్రారంభం కానుంది. ఎస్ఎమ్ఈ ఐపీవోగా వస్తున్న కంపెనీ తాజా ఇష్యూ ద్వారా రూ.46.73 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. అలాగే ప్రైస్ బ్యాండ్ రూ.82గా ఉంది.

చివరిగా మార్కెట్లోకి వస్తున్న ఎస్సెన్ స్పెషాలిటీ ఫిల్మ్స్ ఐపీవో జూన్ 23 నుంచి 27 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉండనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.66 కోట్లను సమీకరిస్తోంది. ఒక్కో షేరుకు ఇష్యూ ధరను రూ.101-107గా కంపెనీ నిర్ణయించింది. మెుత్తం ఐపీవో ద్వారా కంపెనీ 46.99 లక్షల కొత్త షేర్లను, 15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో అమ్మకానికి పెట్టింది.


Click it and Unblock the Notifications